- ఢిల్లీలో నేడు ఎన్డీయే సమావేశం
- హాజరైన చంద్రబాబు, పవన్
- మోదీ సమర్థ నాయకత్వంలో ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని ధీమా
ఢిల్లీలో ఎన్డీయే సమావేశం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం జరిగిందని తెలిపారు. దేశ ప్రజల ఎన్నికల తీర్పును అనుసరించి, ఎన్డీయే కూటమి నాయకుడిగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాల నేతలందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం అని వెల్లడించారు.
మోదీ సమర్థ నాయకత్వంలో మన దేశం అభివృద్ధి పథంలో పయనించేలా, తద్వారా ప్రపంచానికే మార్గదర్శిలా ఎదిగేలా మేమంతా కృషి చేస్తాం అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ మేరకు చంద్రబాబు ఎన్డీయే భేటీ ఫొటోలను కూడా పంచుకున్నారు.
ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశం పట్ల మోదీ స్పందించారు. “ఎంతో విలువైన మా ఎన్డీయే భాగస్వాములను కలవడం జరిగింది. జాతీయ పురోభివృద్ధితో పాటు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడం మా కూటమి లక్ష్యం. 140 కోట్ల మంది దేశ ప్రజల అభ్యున్నతికి పాటుపడడంతో పాటు, వికసిత భారత్ దిశగా కృషి చేస్తాం” అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఎన్డీయే సమావేశం ఫొటోలను కూడా మోదీ పంచుకున్నారు. ఇవాళ్టి ఎన్డీయే భేటీలో మోదీ, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, చిరాగ్ పాశ్వాన్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.