- బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కు ఆర్జేడీ నేత డిమాండ్
- ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన జేడీయూ
- దేశంలో మోదీ మ్యాజిక్ ముగిసిపోయిందన్న తేజస్వీ
‘కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా, కూటమిలో కింగ్ మేకర్ గా అవతరించిన నితీశ్ కుమార్ బీహార్ కు ప్రత్యేక హోదా సాధించాలి’ అంటూ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. బీహార్ సీఎం నితీశ్ కు ఇదొక మంచి అవకాశమని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమికి అవసరమైన మెజారిటీ వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా మోదీ మ్యాజిక్ ముగిసిపోయిందని వివరించారు.
బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఇక ఎన్డీఏ కూటమిలోని మిత్ర పక్షాలపై మోదీ ఆధారపడాల్సిందేనని అన్నారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలో తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి మీటింగ్ కోసం తేజస్వీ బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో ఒకే విమానంలో నితీశ్, తేజస్వీ ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.