- మూడో రౌండ్‌లో ఓట్ల లెక్కింపును తారుమారు చేశారని రాకేశ్ రెడ్డి ఆరోపణ
- ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు అలా మాట్లాడుతున్నారన్న మల్లన్న
- బీఆర్ఎస్ తీరు చూస్తుంటే ఓటమిని అంగీకరించినట్లుగా ఉందని వ్యాఖ్య
వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. అయితే రాకేశ్ రెడ్డి ఓట్ల లెక్కింపు తీరుపై ఆరోపణలు చేశారు. మూడో రౌండ్‌లో ఓట్ల లెక్కింపును తారుమారు చేశారని… ఈ రౌండ్‌ను మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు.
రాకేశ్ రెడ్డి ఆరోపణలపై తీన్మార్ మల్లన్న స్పందించారు. గతంలో మాదిరిగా గోల్‌మాల్ చేసి గెలవాలని బీఆర్ఎస్ భావిస్తోందని విమర్శించారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తీరు చూస్తుంటే ఓటమిని అంగీకరించినట్లుగా కనిపిస్తోందన్నారు. కాగా, మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 1,06,304 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 87,356, బీజేపీ అభ్యర్థికి 34,516 ఓట్లు వచ్చాయి.