- నితీశ్ కుమార్ ఆఫర్‌ను తిరస్కరించారన్న జేడీయూ
- ప్రస్తుతం తాము ఎన్డీయేలోనే కొనసాగుతున్నట్లు స్పష్టీకరణ
- జేడీయూ నేత త్యాగి వెల్లడి
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవిని ఆఫర్ చేసినట్లుగా జేడీయూ వర్గాలు వెల్లడించాయి. అయితే నితీశ్ కుమార్ ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
నితీశ్ కుమార్‌కు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందని, ఆయన మాత్రం తిరస్కరించారని తెలిపారు. ఈ విషయమై ఇండియా కూటమి నేతలు… తమ అధినేతను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ ప్రస్తుతం తాము ఎన్డీయేలో ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. త్యాగి వ్యాఖ్యలను ఖండించింది. నితీశ్‌ను ప్రధానిగా చేసేందుకు ఇండి కూటమి సంప్రదించడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. ఈ విషయం గురించి కేవలం ఆయనకు మాత్రమే తెలుసునని చురక అంటించింది.