Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలి …డిప్యూటీ సీఎం భట్టి

సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం
ఖమ్మం కలెక్టరేట్ లో సాగు నీటిపారుదల, విద్యా శాఖల ప్రగతిపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ,
ప్రపంచంతో పోటీపడే విధంగా ఖమ్మం జిల్లా ను అద్భుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం పనిచేయాలన్నారు. ఉద్యోగులు పారదర్శకంగా, జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ ఆధారితమైన ఖమ్మం జిల్లాలో వ్యవసాయాన్ని బలోపేతం చేసుకోవడం వల్ల ఆర్థిక వనరులు పెరుగుతాయన్నార వ్యవసాయానికి కావాల్సిన సాగు నీరు అందించే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, వాటికి కావాల్సిన నిధులు, పూర్తయ్యే గడువును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎన్ఎస్పీ కెనాల్స్, సీతారామ ప్రాజెక్ట్, మధ్య తరహా, చిన్న తరహా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి క్యాలెండరు తయారు చేసుకుని ఆ ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లాలన్నారు. మొదటగా ఆరు నెలలో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఏడాది లోపు పూర్తయ్యే ప్రాజెక్టులు, రెండు సంవత్సరాల్లో పూర్తి చేసుకునే ప్రాజెక్టులకు సంబంధించి క్యాలెండర్ తయారు చేసుకుని నిర్ణిత గడువులోగా పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకొని పని చేయాలన్నారు. జిల్లాలో కొన్నిచోట్ల చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇప్పటికీ పనులు మొదలు కానీ (ఉదాహరణకు పండ్రేగుపల్లి) ప్రాజెక్టుల పనులను సత్వరం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా నుంచి వృధాగా సముద్రంలోకి నీరు వెళ్లకుండా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకొని సద్వినియోగం చేసుకొని వాడుకునే విధంగా సాగునీటి పారుదల శాఖ అధికారుల పనితీరు ఉండాలన్నారు.
ప్రభుత్వం విద్య పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఉపముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ప్రభుత్వ పాఠశాలల పునః ప్రారంభమైన మొదటి రోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇచ్చింది ఈ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మాణం చేయడానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కేటాయించామన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దేశానికి ఒక మోడల్ గా అద్భుతంగా నిర్మాణం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కొరకు రెవెన్యూ అధికారులు వెంటనే భూములను గుర్తించాలన్నారు. ఏడాదిలోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ సంఖ్యను మరో వందకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
సమీక్ష లో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సమస్యలు అధిగమించాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగుకు వచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అగ్రిమెంట్ ప్రకారం పనుల పూర్తికి అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యకు ఎన్ని నిధులైన ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన కు ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు.
సమీక్ష లో రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పాలేరుకు సంబంధించి 20 కోట్ల ఖర్చుతో 18 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించవచ్చన్నారు. సీజన్ లో ప్రస్తుతమున్న సాగునీటి ప్రాజెక్టుల మరమ్మత్తులు, చిన్న చిన్న పనులు పూర్తి స్థాయిలో చేసి, వాటి పూర్తి సామర్థ్యం తో చిట్ట చివరి ఆయకట్టుకు నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సంవత్సరం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన అభివృద్ధి పరచాలన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పన దిశగా చర్యలు వేగం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కల్గించి, నమోదులు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, విద్యా శాఖలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ లచే పాఠశాలల అభివృద్ధి పనులు, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదులు పెరిగేలా చేపడుతున్న చర్యల గురించి వివరించారు.
ఈ సమావేశంలో సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యే లు మట్టా రాగమయి, రాందాస్ నాయక్, ఉపముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణ భాస్కర్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఇర్రిగేషన్ సిఇ విద్యాసాగర్, డిఇఓ సోమశేఖరశర్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు ..

Ram Narayana

మంత్రి పొంగులేటి దిద్దుబాటు చర్యలు …మీ ముగింటకు మీ ఎమ్మెల్యే పేరుతో పర్యటనలకు శ్రీకారం …

Ram Narayana

శీనన్న ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదు…మంత్రి పొంగులేటి

Ram Narayana

Leave a Comment