- ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన గవర్నర్
- స్వయంగా డీజీపీ జోక్యం చేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన వైనం
- ఆరు నిమిషాల ఆలస్యంగా సభాప్రాంగణానికి వచ్చిన గవర్నర్
- అనంతరం, ప్రమాణస్వీకారం ప్రారంభం
ట్రాఫిక్ నియంత్రణలో పోలీసుల వైఫల్యం కారణంగా నిన్న చంద్రబాబు ప్రమాణస్వీకారం ఆరు నిమిషాల ఆలస్యంగా జరిగింది. ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించాల్సిన గవర్నర్ స్వయంగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సమయానికి వేదిక వద్దకు చేరుకోలేకపోయారు. దీంతో, ప్రమాణస్వీకారం ఆలస్యంగా ప్రారంభమైంది.
బుధవారం ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే, మంగళవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ పేరుతో సామాన్యులను నానా ఇక్కట్లు పెట్టారు. అవసరం లేని చోట్ల బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌ను మళ్లించారు. ప్రమాణస్వీకారం జరిగే గన్నవరంతో సంబంధం లేని దారుల్లోకీ వాహనాలను వదల్లేదు. కానీ, అసలు సమయంలో మాత్రం పోలీసులు విఫలం కావడంతో గవర్నర్ వాహనం.. కేసరపల్లి ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయి ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు ప్రధానమంత్రి సరిగ్గా 11 గంటలకు విమానాశ్రయానికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలకాల్సిన గవర్నర్ మాత్రం అక్కడికి చేరుకోలేకపోయారు. 11.10 గంటలకల్లా ప్రధాని సహా ముఖ్యులంతా వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికీ గవర్నర్ రాలేదు. ఆయన ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారని తెలిసి పోలీసు ఉన్నతాధికారులంతా నానా హైరానా పడ్డారు. డీజీపీ హరీశ్ గుప్తా స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేయడంతో గవర్నర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఫలితంగా ఆరు నిమిషాల ఆలస్యంగా ప్రమాణస్వీకారం ప్రారంభమైంది.