- మనది అయితే వ్యవసాయక్షేత్రం.. కేసీఆర్ గారిది అయితే ఫాంహౌస్ అంటూ ట్వీట్
- నారాయణపురంలోని పంటపొలాల్లో కలియదిరిగిన మంత్రి
- ఫొటోలను ట్విట్టర్ లో పంచుకుంటూ వ్యవసాయక్షేత్రంలో అంటూ పోస్ట్
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ‘మనది అయితే వ్యవసాయక్షేత్రం అనాలి.. కేసీఆర్ గారిది అయితే ఫాం హౌస్ అనాలి’ అంటూ కామెంట్ చేసింది. మంత్రి చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఈ క్యాప్షన్ జోడించింది. బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఈ పోస్ట్ ను నెటిజన్లతో పంచుకుంది. మంత్రి పొంగులేటి బుధవారం ఉదయం తన వ్యవసాయక్షేత్రంలో పర్యటించారు. నిత్యం అధికారిక కార్యక్రమాలు, బాధ్యతలతో గడిపే మంత్రి కాసేపు పొలాల్లో కలియదిరిగారు.
కల్లూరు మండలంలోని నారాయణపురంలో పచ్చని పంట పొలాల మధ్య తెల్ల చొక్కా, తెల్ల లుంగీలో ఉన్న ఫొటోలను మంత్రి ట్వీట్ చేశారు. స్థానిక రైతులతో ముచ్చటించి, వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఫొటోలను ట్విట్టర్ లో పెట్టగా.. బీఆర్ఎస్ పార్టీ వ్యంగ్యంగా రియాక్ట్ అయింది. మంత్రి పొంగులేటిపై సెటైరికల్ పోస్టుతో విమర్శలు గుప్పించింది.