- ఎం అనసూయ నుంచి ఎం.అనుకతిర్ సూర్యగా, స్త్రీ నుంచి పురుషుడిగా మారిన వైనం
- భారత సివిల్ సర్వీసెస్ చరిత్రలో తొలిసారి ఆసక్తికర ఘటన
- సీనియర్ ఉద్యోగి అభ్యర్థనకు అనుమతి ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ
భారత సివిల్ సర్వీసెస్ చరిత్రలో తొలిసారి ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఐఆర్ఎస్‌లో (ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ) పని చేస్తున్న ఓ సీనియర్ అధికారి అన్ని అధికారిక రికార్డుల్లో తన పేరు, లింగాన్ని మార్చుకున్నారు. ఈ తరహాలో చరిత్రలో తొలిసారి వచ్చిన అభ్యర్థనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్‌లో కస్టమ్స్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల ఎం అనసూయ ఇప్పుడు ఎం.అనుకతిర్ సూర్యగా మారిపోయారు. ఇన్నాళ్లు స్త్రీగా ఉన్న అనుకతిర్‌ను ఇకపై పురుషుడిగా ప్రభుత్వం పరిగణించనుంది. అన్ని అధికారిక రికార్డుల్లోనూ అనుకతిర్ సూర్యగా గుర్తిస్తారు.
కాగా లింక్డ్ఇన్‌లో లభ్యమైన ప్రొఫైల్ ప్రకారం.. సూర్య డిసెంబర్ 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమీషనర్‌గా ప్రమోషన్ పొందారు. గతేడాది నుంచి హైదరాబాద్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీలో 2023లో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.