- బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు రేవంత్ రెడ్డి లౌకిక శక్తులను ఏకం చేయాలన్న సీపీఎం నేత
- బీఆర్ఎస్‌కు మనుగడ ఉండాలంటే బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని సూచన
- తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు పెరగడం ప్రమాదకరమని వ్యాఖ్య
- కేరళలో బీజేపీ ఒక సీటు గెలవడం చింతించాల్సిన విషయమేనన్న సీపీఎం నేత
తెలంగాణలో ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా? ఎప్పుడు గద్దెనెక్కుదామా? అని బీజేపీ కాచుకొని కూర్చుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు లౌకిక శక్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలపై కేంద్రం మోపిన భారాన్ని మరిచిపోయి… రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చదువుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ… తెలంగాణలో బీఆర్ఎస్‌కు మనుగడ ఉండాలంటే బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సూచించారు. పార్లమెంట్‌లో ఇష్యూ టు ఇష్యూను బట్టి వ్యవహరిస్తామని కేటీఆర్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. అలా స్పందించడమంటే రాజకీయం కాదని… లొంగుబాటు అవుతుందన్నారు.
దేశమంతా అభివృద్ధి జరిగితే ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు ఎందుకు తగ్గాయో ప్రధాని మోదీ చెప్పాలని నిలదీశారు. సీట్లు ఎందుకు తగ్గాయో ఆలోచన, ఆత్మవిమర్శ లేకుండా మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ ఎన్నికలను డబ్బులతో ముంచేసిందని ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు పెరగడం ప్రమాదకరం
తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 19 శాతం నుంచి 35 శాతానికి పెరగడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఇక్కడ బీజేపీని నియంత్రించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కేరళలోనూ బీజేపీ ఒక సీటు సాధించడం చింతించాల్సిన విషయమే అన్నారు. ప్రధాని మోదీ కార్పోరేట్ శక్తులకు సేవకుడిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇండియా కూటమి విచ్ఛిన్నం కాకుండా ముందుకు వెళ్లడంలో సీపీఎం చేసిన త్యాగం మరే పార్టీ చేయలేదన్నారు. ఓట్లు.. సీట్లు కాదని… దేశాన్ని రక్షించుకోవడమే సీపీఎం లక్ష్యమన్నారు. తెలంగాణలో మతోన్మాదాన్ని ప్రజల మనస్సులో నుంచి తొలగించే బాధ్యత సీపీఎంపై ఉందన్నారు.