- అమెరికా చరిత్రలో కాల్పులకు బలైన నలుగురు దేశాధ్యక్షులు
- మరికొందరు గాయాలతో బయటపడ్డ వైనం
- 1865లోనే అగ్రరాజ్యంలో వెలుగులోకి వచ్చిన కాల్పుల సంస్కృతి
అమెరికా మాజీ అధ్యక్షుడు, మరోసారి దేశాధ్యక్ష పోటీలో ఉన్న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై శనివారం పెన్సిల్వేనియాలో హత్యాయత్నం జరగడం తెలిసిందే. అయితే ఇదేమీ తొలి సంఘటన కాదు. అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ గతంలోనూ పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. మొత్తంగా నలుగురు అమెరికా అధ్యక్షులు దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వాళ్లు ఎవరంటే…
అబ్రహం లింకన్
అమెరికా 16వ అధ్యక్షుడిగా లింకన్ పనిచేశారు. 1865 ఏప్రిల్ 14న ఆయన హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ లోని ఫోర్డ్స్ థియేటర్ లో తన భార్య మేరీ టాడ్ లింకన్ తో కలిసి కార్యక్రమాన్ని వీక్షిస్తుండగా జాన్ విల్కిస్ బూత్ అనే దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఆయన తల వెనకాల తూటా తగిలింది. హుటాహుటిన సమీప ఆసుప్రతికి తరలించినప్పటికీ మర్నాటి ఉదయం కన్నుమూశారు. అమెరికాలో 1863లో జరిగిన అంతర్యుద్ధంలో నల్ల జాతీయుల హక్కులకు లింకన్ మద్దతు పలకడంతోపాటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బానిసలుగా పనిచేస్తున్న నల్లజాతీయులకు స్వేచ్ఛ కల్పిస్తూ ఆదేశాలివ్వడం ఆయన హత్యకు కారణమైంది.
జేమ్స్ ఎ. గ్యారిఫీల్డ్
అమెరికా 20వ అధ్యక్షుడిగా గ్యారిఫీల్డ్ వ్యవహరించారు. అధికారం చేపట్టిన ఆరు నెలలకే హత్యకు గురైన రెండో దేశాధ్యక్షుడు. 1881 జులై 2న న్యూ ఇంగ్లాండ్ కు వెళ్లడం కోసం వాషింగ్టన్ స్టేషన్ లో రైలు ఎక్కేందుకు నడుచుకుంటూ వెళ్తుండగా చార్లెస్ గీటూ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయినప్పటికీ ఆయన కొన్ని వారాలపాటు వైట్ హౌస్ లో జీవించారు. టెలిఫోన్ ను కనిపెట్టిన గ్రాహం బెల్ ఒక ప్రత్యేక పరికరం ద్వారా గ్యారిఫీల్డ్ శరీరంలోకి దూసుకెళ్లిన తూటా ఎక్కడుందో గుర్తించేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. చివరకు సెప్టెంబర్ లో న్యూజెర్సీలో ఆయన కన్నుమూశారు. చార్లెస్ గీటూకు 1882 జూన్ లో మరణశిక్ష అమలు చేశారు.
విలియం మెక్ కిన్లే
అమెరికా 25వ అధ్యక్షుడిగా మెక్ కిన్లే పనిచేశారు. న్యూయార్క్ లోని బఫెలో నగరంలో 1901 సెప్టెంబర్ 6న ప్రసంగం ముగించిన కాసేపటికే ఆయనపై కాల్పులు జరిగాయి. ప్రజలకు అభివాదం చేస్తుండగా లియోన్ ఎఫ్. జోల్గోజ్ అనే నిరుద్యోగి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరపడంతో ఆయన ఛాతీలోకి రెండు తూటాలు దూసుకెళ్లాయి. ఆయన కోలుకుంటారని వైద్యులు భావించినప్పటికీ గ్యాంగ్ రీన్ వల్ల గాయపడిన ప్రదేశం కుళ్లిపోవడంతో ఆరోగ్యం క్షీణించి 1901 సెప్టెంబర్ 14న ఆయన మరణించారు. రెండోసారి అధికారం చేపట్టిన ఆరు నెలలకే కన్నుమూశారు. దీంతో 1901 అక్టోబర్ 29న విద్యుత్ షాక్ ద్వారా లియోన్ ఎఫ్. జోల్గోజ్ కు మరణశిక్ష అమలు చేశారు.
జాన్ ఎఫ్ కెన్నెడీ
అమెరికా 35వ అధ్యక్షుడు. 1963 నవంబర్ లో తన సతీమణి జాక్వెలీన్ కెన్నెడీతో కలిసి జాన్ ఎఫ్. కెన్నెడీ తన కాన్వాయ్ లో డాలస్ లోని డీలీ ప్లాజా మీదుగా వెళ్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. లీ హార్వే ఓస్వాల్డ్ అనే దుండగుడు ఆయనపై హైపవర్ రైఫిల్ తో దూరం నుంచి కాల్పులు జరిపాడు. దీంతో ఆయన్ను హుటాహుటిన పార్క్ ల్యాండ్ మెమోరియల్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో అప్పటి ఉపాధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ అధ్యక్షుడిగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రమాణం చేశారు. తద్వారా ఈ విమానంలో ప్రమాణస్వీకారం చేసిన ఏకైక దేశాధ్యక్షుడిగా ఆయన నిలిచారు. కెన్నెడీ హత్య జరిగిన రెండు రోజులకు లీ హార్వే ఓస్వాల్డ్ ను జైలుకు తరలించగా అక్కడ జాక్ రూబీ అనే నైట్ క్లబ్ యజమాని అతన్ని కాల్చి చంపాడు.
ఫ్రాంక్లిన్ డి. రూస్ వెల్ట్
అమెరికా 32వ అధ్యక్షుడిగా ఎన్నికైన రూస్ వెల్ట్ 1933 ఫిబ్రవరిలో మయామీలో ప్రమాణస్వీకారం చేసే ముందు ప్రసంగిస్తుండగా ఆయన్ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిగాయి. గిసెప్పే జంగారా అనే దుండగుడు తన కారులోంచి కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల నుంచి రూస్ వెల్ట్ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. కానీ రూస్ వెల్ట్ పక్కన నిలబడిన షికాగో మేయర్ ఆంటన్ సెర్మక్ ఈ కాల్పుల్లో మరణించారు. ఈ కేసులో దోషిగా తేలిన జంగారాకు ఆ తర్వాత కొంతకాలానికి మరణశిక్ష అమలు చేశారు.
హ్యారీ ఎస్. ట్రూమన్
అమెరికా 33వ అధ్యక్షుడిగా పనిచేశారు. 1950 నవంబర్ లో వైట్ హౌస్ సమీపంలోని బ్లెయిర్ హౌస్ లో నివసిస్తుండగా తుపాకులతో ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. అయితే ఈ ఘటనలో ఆయనకు ప్రాణహాని తప్పింది. దుండగులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక దుండగుడు, ఒక పోలీసు అధికారి మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. దుండగుల్లో మరొకరైన ఆస్కార్ కొలాజోను పోలీసులు అరెస్టు చేశారు. అతనికి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పగా 1952లో ట్రూమన్ మాత్రం అతని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు. చివరకు 1979లో అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కొలాజోకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేశారు.
గెరాల్డ్ ఫోర్డ్
అమెరికా 38వ అధ్యక్షుడైన గెరాల్డ్ ఫోర్డ్ పై 1975లో కొన్ని వారాల వ్యవధిలోనే రెండుసార్లు హత్యా యత్నాలు జరిగాయి. అయితే ఆ రెండు ఘటనల్లోనూ అదృష్టవశాత్తూ ఆయన ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. నాటి క్యాలిఫోర్నియా గవర్నర్ ను శాక్రామెంటోలో కలిసేందుకు ఫోర్డ్ వెళ్తుండగా జనంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన లినెట్ ఫ్రోం అనే దుండగుడు ఆయనకు సెమీ ఆటోమెటిక్ పిస్టల్ ను గురిపెట్టాడు. కానీ ఆ సమయంలో తుపాకీ పేలలేదు. ఇది జరిగిన 17 రోజులకే సారా జేన్ మూరే అనే మహిళ శాన్ ఫాన్సిస్కోలో ఫోర్డ్ ను అడ్డగించి కాల్పులు జరిపింది. కానీ ఆయనకు తూటా తగల్లేదు. ఈ రెండు సంఘటనల్లోనూ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లినెట్ ఫ్రోంను 2009లో జైలు నుంచి విడుదల చేయగా మూరేను 2007లోనే జైలు నుంచి విడిచిపెట్టారు.
రొనాల్డ్ రీగన్
అమెరికా 40వ అధ్యక్షుడు. 1981 మార్చిలో వాషింగ్టన్ లో ప్రసంగం అనంతరం తన కాన్వాయ్ లో బయలుదేరగా జాన్ హింక్లే జూనియర్ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రీగన్ తోపాటు ఆయన మీడియా కార్యదర్శి జేమ్స్ బ్రాడీ, మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే పిచ్చితనం వల్ల కాల్పులు జరిపినందుకు జాన్ హింక్లే జూనియర్ ను కోర్టు నిర్ధోషిగా తేల్చింది. కానీ మెంటల్ హాస్పిటల్ లో చేర్పించాలని ఆదేశించింది. అయితే అతని వల్ల సమాజానికి ఎలాంటి ముప్పు లేదని కోర్టు తేల్చడంతో చివరకు 2022లో అతన్ని ఆసుపత్రి నుంచి విడుదల చేశారు.
జార్జి డబ్ల్యూ. బుష్
అమెరికా 43వ అధ్యక్షుడిగా పనిచేశారు. 2005లో తిబిలిసీలో జార్జియా అధ్యక్షుడు మిఖాయిల్ సాకాష్ విలీతో కలిసి బుష్ ఓ బహిరంగ సభకు హాజరవగా వారిని హతమార్చేందుకు ఓ దుండగుడు బట్టలో చుట్టిన గ్రెనేడ్ విసిరాడు. అయితే గ్రెనేడ్ వారికి దాదాపు 100 అడుగుల దూరంలో పడటం, పేలకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వ్లాదిమర్ ఆర్యుత్యినియన్ అనే దుండగుడిని కోర్టు ఈ కేసులో దోషిగా తేల్చి యావజ్జీవ జైలు శిక్ష విధించింది.
రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ
అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ ఎఫ్. కెన్నెడీ సోదరుడు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం 1968లో డెమొక్రటిక్ పార్టీ తరఫున రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ పోటీలో నిలిచారు. క్యాలిఫోర్నియా ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా లాస్ ఏంజిలెస్ లోని ఓ హోటల్ లో ప్రసంగిస్తుండగా సిర్హన్ అనే దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించారు. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ కేసులో కోర్టు సిర్హన్ ను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఆ తర్వాత దాన్ని యావజ్జీవంగా మార్చింది.
జార్జి వాలెస్
దేశాధ్యక్ష బరిలో నిలిచేందుకు డెమొక్రటిక్ పార్టీ తరఫున 1972లో పోటీ చేశారు. అప్పుడు ఆయన అలబామా గవర్నర్ గా ఉన్నారు. మేరీల్యాండ్ లో ప్రచారం కోసం వచ్చిన ఆయనపై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వాలెస్ గాయపడ్డారు. ఆయన నడుం కింది భాగం చచ్చుబడిపోవడంతో జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. అయినప్పటికీ 1974లో మళ్లీ అలబామా గవర్నర్ గా పోటీ చేసి గెలిచారు. 1998 సెప్టెంబర్ 13న కన్నుమూశారు. ఈ కేసులో ఆర్థర్ బ్రెమర్ అనే దుండగుడిని కోర్టు దోషిగా తేల్చి జైలుశిక్ష విధించింది. 2007లో అతను జైలు నుంచి విడుదలయ్యాడు.