- మల్లికార్జున స్వామిని చేరుకున్న వాసుకి
- అరుదైన దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తులు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. మల్లికార్జున స్వామి చెంతకు వాసుకి చేరుకుంది. స్వామి ప్రతిరూపమైన లింగాన్ని చుట్టుకుని కనిపించడంతో భక్తులు మైమరిచిపోయారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లోని ప్రసిద్ధ శ్రీశైల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ క్షేత్రంలోని పాతాళ గంగ వద్ద చంద్రలింగం ఉంది. భక్తులు నిత్యం దర్శించుకునే ఈ లింగం వద్ద మంగళవారం అద్భుతం జరిగింది. చంద్రలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులకు లింగాన్ని చుట్టుకున్న నాగుపాము కనిపించింది.
ఇది చూసి మల్లికార్జున స్వామి వద్దకు వాసుకి వచ్చి చేరిందని విశ్వసిస్తూ భక్తులు తన్మయత్వం చెందారు. ఈ విషయం తెలిసి భక్తులు ఆలయానికి పోటెత్తారు. కాగా, అటవీ ప్రాంతం కావడంతో ఆలయం చుట్టుపక్కల పాములు తిరుగాడటం సాధారణమే కానీ ఇలా లింగాన్ని ఓ పాము చుట్టుకుని కనిపించడం అసాధారణమని ఆలయ సిబ్బంది తెలిపారు. గతంలో ఇలాంటి సంఘటన జరిగినట్లు వినలేదని పేర్కొన్నారు. ఈ అసాధారణ దృశ్యాన్ని కొంతమంది భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.