Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌లోని అన్ని భారత వీసా సెంటర్లు మూసివేత!

  • వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు దౌత్యాధికారుల ప్రకట‌న‌
  • అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల‌డి
  • తదుపరి నోటీసులు వచ్చేంత వరకూ అన్ని సెంటర్లూ మూసే ఉంటాయని స్పష్టీక‌ర‌ణ‌

పొరుగు దేశం బంగ్లాదేశ్ నిర‌స‌న‌కారుల ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతోంది. ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో రిజర్వేష‌న్ కోటాకు వ్య‌తిరేకంగా గ‌త నెల‌లో మొద‌లైన నిర‌స‌న‌లు ఇటీవ‌ల హింసాత్మ‌కంగా మారాయి. దాంతో ఆ దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం, దేశం విడిచిపెట్టి వెళ్లిపోవ‌డం జ‌రిగిపోయాయి. 

అలా ఆమె దేశం విడిచిపెట్టినా.. ఇంకా అక్క‌డ ఆగ్ర‌హ‌జ్వాల‌లు ఆర‌డం లేదు. నిర‌స‌న‌కారులు భారీ మొత్తంలో ప్ర‌భుత్వ, మైనారిటీల‌ ఆస్తుల‌ను ధ్వంసం చేస్తున్నారు. దాంతో రాజ‌ధాని ఢాకా ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

అశాంతి, భారీ నిరసనల మధ్య బంగ్లాదేశ్‌లోని అన్ని భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలు నిరవధికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి నోటీసులు వచ్చేంత వరకూ అన్ని సెంటర్లూ మూసే ఉంటాయని స్పష్టం చేశారు. అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారమివ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు భారత వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో మెసేజ్‌ పెట్టారు.

కాగా, దేశంలో నెల‌కొన్న‌ అస్థిర పరిస్థితుల నేప‌థ్యంలో బంగ్లాదేశ్‌లోని హైకమిషన్, కాన్సులేట్‌ల నుండి 190 మంది అనవసర సిబ్బంది, వారి కుటుంబ స‌భ్యులను ఇండియా ఖాళీ చేసిన మ‌రుస‌టి రోజు ఈ పరిణామం జరిగింది. అయితే, దౌత్యవేత్తలందరూ బంగ్లాదేశ్‌లోనే ఉన్నారు. అలాగే దౌత్య‌ మిషన్లు (వ్యవస్థలు) పనిచేస్తాయి. ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హై కమిషన్‌తో పాటు చిట్టగాంగ్, రాజ్‌షాహి, ఖుల్నా, సిల్హెట్‌లలో భారతదేశం కాన్సులేట్‌లను కలిగి ఉన్న విష‌యం తెలిసిందే.

Related posts

మాల్దీవుల పశ్చాత్తాపం.. భారత్ పై ఇంకెప్పుడు అలాంటి వ్యాఖ్యలు పునరావృతం కావంటూ హామీ

Ram Narayana

పరస్పర క్షిపణి దాడుల తర్వాత కీలక పరిణామం.. పాకిస్తాన్-ఇరాన్ మధ్య కుదిరిన సయోధ్య

Ram Narayana

ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాలలో 10వ స్థానంలో ఢిల్లీ !

Ram Narayana

Leave a Comment