Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఒడిశాలో ఉద్యోగాలు చేస్తున్న మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌..!

  • ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు 
  • నెల‌స‌రి స‌మ‌యంలో తొలిరోజు లేదా రెండో రోజు సెల‌వు ఇవ్వాల‌ని నిర్ణ‌యం
  • ఈ మేర‌కు ఆ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప్ర‌భాతి ప‌రిడ ప్ర‌క‌ట‌న‌

ఒడిశాలో ప్ర‌భుత్వ, ప్రైవేట్ సంస్థ‌ల్లో ఉద్యోగాలు చేస్తున్న మ‌హిళ‌ల‌కు స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా అక్క‌డి స‌ర్కార్ తీపి కబురు చెప్పింది. ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఉద్యోగినుల‌కు నెల‌స‌రి స‌మ‌యంలో తొలిరోజు లేదా రెండో రోజు సెల‌వు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప్ర‌భాతి ప‌రిడ వెల్ల‌డించారు. 

ఇది ఉద్యోగాలు చేస్తున్న మ‌హిళ‌లంద‌రికీ వ‌ర్తిస్తుంద‌న్నారు. గురువారం క‌ట‌క్‌లో జ‌రిగిన ఇండిపెండెన్స్ డే వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం ఈ మేర‌కు మీడియాతో మాట్లాడుతూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ఉద్యోగినులు ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల‌ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే సామాజిక కార్య‌క‌ర్త న‌మ్ర‌తా చ‌డ్డా కూడా హర్షం వ్య‌క్తం చేశారు. మరోవైపు ప్రస్తుతం బీహార్, కేరళ ప్రభుత్వాలు మాత్రమే మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి.

ప్రభుత్వాలతో పాటు కొన్ని యూనివర్సిటీలు కూడా నెలసరి సెలవులను ప్రకటించాయి. వాటిల్లో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, తేజ్‌పూర్, అస్సాంలోని గువాహటి, చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీల విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి.

ఇక జొమాటో వంటి ప్రైవేట్ సంస్థల్లోనూ మహిళలకు ఇలా సెలవులు ఇస్తున్నారు. ఏడాదికి పది పెయిడ్ పీరియడ్ లీవ్స్‌లను జొమాటో 2020 నుంచి అమలు చేస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా నెలసరి సెలవులకు సంబంధించి ఎలాంటి చట్టం లేదు. మహిళలకు నెలసరి సెలవులకు సంబంధించి 2022లోనే కేంద్రం ఓ బిల్లు తీసుకువచ్చింది. అయితే, ఆ బిల్లు ఇప్పటికీ ఆమోదం పొందలేదు. ఈ పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.

Related posts

వినేశ్ ఫోగాట్, బబితా ఫోగాట్ మధ్య మాటల యుద్ధం!

Ram Narayana

కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్.. ఒక్కరోజు ఖర్చెంతంటే!

Drukpadam

భార‌త్‌లోని ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితా విడుద‌ల‌.. టాప్‌లో తెలంగాణ‌!

Ram Narayana

Leave a Comment