భాగ్యనగరంలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా …కోర్ట్ ను ఆశ్రయించిన నేతలు
అక్రమ నిర్మాణాల కూల్చివేత… కేటీఆర్ ఫామ్ హౌస్, నాగార్జున ఎన్ కన్వెన్షన్‌కు హైడ్రా షాక్?
జన్వాడ ఫామ్ హౌస్ కూల్చకుండా స్టే విధించాలని బీఆర్ఎస్ నేత పిటిషన్
నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై ఫిర్యాదులు
హైడ్రా కూల్చివేతలపై ప్రశ్నించిన హైకోర్టు
ఇప్పుడు హైద్రాబాద్ లో ఏ నోటా విన్న హైడ్రా మాటే …అక్రమ కట్టడాలపై హైడ్రా కమిషనర్ ఏ .రంగనాథ్ సింగంలా మారాడు…అనేక సందర్భాలలో అక్రమ కట్టడాలను కూల్చి నప్పటికీ ఇంతగా భయపడిన సందర్భం లేదు …అక్రమంగా బహుళ అంతస్తులు, ఖరీదైన గృహాలు , ఫామ్ హౌసులు నిర్మించుకున్న పెద్దలు హైడ్రా అంటే హడలి చస్తున్నారు …అక్రమార్కుల గుండెల్లో రంగనాథ్ సింహ స్వప్నంగా మారాడు … దీనిపై రాజకీయ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి…అయితే నోరు ఇప్పెందుకు వణికి పోతున్నారు …
హైదరాబాద్‌లో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కొరడా ఝుళిపిస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో దానిని కూల్చివేసే అవకాశం ఉన్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్‌ను కూల్చకుండా చూడాలని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని కూల్చకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్‌పల్లి రెవిన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెందినదిగా ప్రచారంలో ఉంది.
అలాగే, హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూడా కూల్చివేయాలని ఫిర్యాదులు వచ్చాయి. జన్వాడ ఫామ్ హౌస్, ఎన్ కన్వెన్షన్‌తో పాటు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ఇతర ప్రముఖుల నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకుంటామని హైడ్రా చెబుతోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలోని పలు చెరువులను ఈరోజు పరిశీలిస్తున్నారు. ఆక్రమణకు గురైన బతుకమ్మ కుంటను కూడా పరిశీలించారు.
అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయడం ఏమిటి?: హైకోర్టు
జన్వాడ ఫామ్ హౌస్ కూల్చవద్దని ప్రవీణ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. హైడ్రాకు ఉన్న పరిమితుల గురించి చెప్పాలని ఏఏజీకి హైకోర్టు సూచించింది. ఇది స్వయంప్రతిపత్తిగల సంస్థ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణం జరిగిన 15 – 20 ఏళ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణాలని కూల్చి వేయడమేమిటని హైకోర్టు ప్రశ్నించింది.
చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటైందని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ప్రవీణ్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణార్హమైనది కాదన్నారు. ఈ ఫామ్ హౌస్ జీవో 111లోకి వస్తుందని తెలిపారు.
జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
- హైడ్రా ఏర్పాటు, లీగల్ స్టేటస్, విధివిధానాలపై హైకోర్టు ప్రశ్న
- చెరువులు, నాలాల పరిరక్షణ కోసం హైడ్రా పని చేస్తుందన్న ప్రభుత్వ లాయర్
- జన్వాడ ఫామ్ హౌస్‌కు సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలించాలని ఆదేశం
- రేపటి వరకు కూల్చివేత చేపట్టవద్దన్న హైకోర్టు
జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతను రేపటి వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు బుధవారం హైడ్రాను ఆదేశించింది. ఈ ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో కూల్చివేసే అవకాశముందని భావించిన బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం వరకు స్టే విధించింది.
పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం హైడ్రాను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. హైడ్రా లీగల్ స్టేటస్, విధివిధానాలను చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగింది. హైడ్రా ఏర్పాటును అభినందిస్తూనే… హైడ్రా ఏర్పాటు, కమిషనర్‌కు ఉన్న పరిధులను ప్రశ్నించింది.
హైడ్రా… ఓఆర్ఆర్ పరిధిలో పని చేస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి ఇది పని చేస్తుందన్నారు. హైడ్రా జీవో 111 పరిధిలోకి రాదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
అయితే నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖ అనుమతిస్తూ… మరో శాఖ కూల్చివేస్తుందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇరవై ఏళ్ల క్రితం నాటి నిర్మాణాలను హైడ్రా ఇప్పుడు కూలుస్తోందని హైకోర్టు పేర్కొంది.
ఆగస్ట్ 14న కొంతమంది అధికారులు వచ్చి జన్వాడ ఫామ్ హౌస్‌ను కూల్చివేస్తామని బెదిరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు… జన్వాడ ఫామ్ హౌస్‌కు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశించింది. జీవో 99 ప్రకారం నిబంధనల మేరకు హైడ్రా నడుచుకోవాలని పేర్కొంది.