ప్రజలను ఆదుకోవటంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం
ముగ్గురు మంత్రులు ఉన్నా కదలని యంత్రాంగం
పూర్తిగా మునిగిపోయిన ఇండ్లకు మూడు లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు లక్ష రూపాయలు, చనిపోయిన వారికి 20 లక్షలు ఇవ్వాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
వరదల నుండి ప్రజలను కాపాడటంలో జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలం అయిందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం నాడు సుందరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ముగ్గురు క్యాబినెట్ మంత్రులు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం కదల లేదన్నారు. ఖమ్మం చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదలు ముంచెత్తడం ఒక రికార్డు అయితే, అధికార యంత్రాంగం వైఫల్యం మరొక రికార్డు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో పైనుండి వస్తున్న మున్నేరు వరద ప్రవాహాన్ని, వర్షపాతం తీవ్రతను తెలుసు కోలేకపోవటం, గత మూడు రోజులుగా వాతావరణ శాఖ అనేక హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోవడంలో, జిల్లా కేంద్రంలో హెలికాప్టర్‌ను, ఎన్.డి.ఆర్.ఎఫ్. ఫోర్సును అందుబాటులో ఉంచలేదన్నారు.
ఖమ్మం నగరంలో మోతి నగర్, కాల్వ ఒడ్డు, వెంకటేశ్వర నగర్, సమ్మక్క సారక్క నగర్, బొక్కలగడ్డ, సుందరయ్య నగర్, వరదయ్య నగర్, కవి రాజనగర్, అగ్రహారం కొత్తూరు కాలనీ, జలగం నగర్, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలు, దానవాయిగూడెం ప్రాంతంలో పదివేల కుటుంబాలు వరద బారిన పడ్డాయన్నారు. అత్యధికులు కట్టుబట్టలతో బయటకు వచ్చారని, సర్వస్వం కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా మునిగి దెబ్బతిన్న గృహాలకు మూడు లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న వాటికి లక్ష రూపాయలు, చనిపోయిన వారికి 20 లక్షలు ఇవ్వాలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముంపు ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించి, పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి సమీక్షలో అధికారుల నిర్లక్ష్యం పైన చర్చించాలని, తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలను ఆదుకోవటంలో సిపిఎం కార్యకర్తలు:
వరదలు ముంచెత్తిన వెంటనే సిపిఎం కార్యకర్తలు నాయకులు అనేక ప్రాంతాల్లో ప్రజలను బయటకు తీసుకురావడంలో ఎంతో శ్రమించారని చెప్పారు. సిపిఎం కార్యాలయాలను నిర్వాసిత కేంద్రాలుగా ఉపయోగించుకోమని సిపిఎం జిల్లా కమిటీ జిల్లా అధికారులకు తెలిపిందన్నారు. ముంపుకు గురైన వారిని పార్టీ కార్యాలయానికి తరలించి వారికి వసతి భోజనాలు, కప్పుకోవడానికి దుప్పట్లు కొనిచ్చామని, దాతల సహాయంతో అనేక ప్రాంతాల్లో సుమారు 4000 భోజనాలు అందించామని నున్నా తెలిపారు. సహాయ కార్యక్రమాలలో పాల్గొన్న వారికి అభినందనలు, సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు..ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, వై విక్రం పాల్గొన్నారు.