- నెలకు రూ.173 మాత్రమే వెచ్చించేలా రూ.1,889 ప్లాన్ ప్రకటన
- ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ప్రకటన
- నెలవారీ రీఛార్జ్ కావాలనుకునేవారి కోసం రూ.189 ప్లాన్ పరిచయం
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ వంటి టెలికం ఆపరేటర్లు ఇటీవల రీఛార్జ్ రేట్లను గణనీయంగా పెంచడంతో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షలాది మంది యూజర్లు పోర్ట్ అయ్యారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త వ్యాల్యూ యాడెడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది.
అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే ఆఫర్లను జియో ఆవిష్కరించింది. సాధారణంగా కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ రేట్లు కనీసం రూ.180 నుంచి రూ.200 మధ్య ఉంటాయి. అయితే నెలకు రూ.173 మాత్రమే వెచ్చించేలా రూ.1,889 ప్లాన్‌ను జియో పరిచయం చేసింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 3600 ఉచిత మెసేజులు, జియో అనుబంధ యాప్‌ల యాక్సెస్‌తో పాటు అదనంగా 24 జీబీల హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది.
నెలవారీ ప్లాన్ ఇలా..
నెలవారీ ప్లాన్‌ను పొందాలనుకుంటే రూ. 189 రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, నెలకు 300 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు 2జీబీ డేటా కూడా పొందవచ్చు. వినియోగదారులు జియోటీవీ, జీయో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో అనుబంధ యాప్‌ల సర్వీసులు పొందవచ్చు.