నక్సల్స్ కు డీజీపీ కీలక పిలుపు…
భద్రాద్రి జిల్లాలో .. జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు తెలంగాణా డీజీపీ డాక్టర్ జితేందర్ కీలక పిలుపునిచ్చారు. ఈమేరకు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ హితవు చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్లకు వెంటనే పునరావాసం కల్పిస్తామని చెప్పారు. తెలంగాణాలో విప్లవ కార్యకలాపాలకు స్థానం లేదని డీజీపీ చెప్పారు. తెలంగాణా ప్రభుత్వ సంక్షేమ పాలనలో ఆయుధాలతో సంచరించి విప్లవ కార్యకలాపాలు నిర్వహించడానికి చోటు లేదన్నారు. అర్థం పర్థం లేని హింస విషయంలో ప్రజలు చైతన్యవంతమయ్యారన్నారు.
కాగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో జరిగిన ఎన్కౌంటర్ పూర్వాపరాలను కూడా డీజీపీ వివరించారు. ఈ ఉదయం 6.45 గంటల ప్రాంతంలో పోలీసు బృందాలు మోతె అడవుల్లో గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా సాయుధ మావోయిస్టు పార్టీ నక్సలైట్లతో పరస్పర కాల్పులు జరిగినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళా నక్సలైట్లు సహా మొత్తం ఆరుగురు నక్సల్స్ మరణించినట్లు చెప్పారు. అంతేగాక ఇద్దరు పోలీసులకు కూడా నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడ్డారని, వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో రెండు ఏకే-47, ఒకటి చొప్పున ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, పిస్టల్, మాగ్జిన్స్, ఆయుధ సామాగ్రి, కిట్ బ్యాగులు తదితర సామాగ్రిని స్వాధీనపర్చుకున్నట్లు చెప్పారు. మరణించిన నక్సలైట్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, ఎన్కౌంటర్ స్థలి నుంచి తప్పించుకున్న నక్సలైట్ల కోసం గాలిస్తున్నట్లు డీజీపీ జితేందర్ వివరించారు.