- నాగపూర్ లో పాత్రికేయుల సన్మాన కార్యక్రమం
- హాజరైన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
- ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ముందు ఓ విపక్ష నేత కలిశారని వెల్లడి
- ఇండియా కూటమిని బలపరచాలని కోరాడన్న కేంద్రమంత్రి
- తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని చెప్పి అతడ్ని పంపించేశానని వివరణ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఇటీవల తనకు ప్రధానమంత్రి ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. అయితే, అందుకు తాను అంగీకరించలేదని స్పష్టం చేశారు.
2024 లోక్ సభ ఎన్నికలకు ముందు, తనను ఓ పార్టీకి చెందిన కీలక నేత కలిశాడని, ఇండియా కూటమిని బలపరచాలని ఆ నేత కోరాడని వెల్లడించారు. మీరు ప్రధాని అవుతామంటే మద్దతు ఇస్తామని ఆ నేత చెప్పాడని గడ్కరీ తెలిపారు.
ఇండియా కూటమి గెలిస్తే… తనను ప్రధానమంత్రిని చేస్తానని ఆ నేత హామీ ఇచ్చారని, కానీ, తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని చెప్పి ఆ నేతను పంపించివేశానని వివరించారు. ప్రధానమంత్రిని కావడం అనేది తన జీవితలక్ష్యం కాదని ఆ నేతకు అర్థమయ్యేట్టు చెప్పానని, ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశానని గడ్కరీ పేర్కొన్నారు.
కాగా, తనను కలిసిన సీనియర్ నేత ఎవరు? ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి? అనేది మాత్రం గడ్కరీ వెల్లడించలేదు. మహారాష్ట్రలోని నాగపూర్ లో పాత్రికేయుల సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు తెలిపారు.