- హిజ్బుల్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పక్కా ప్లానింగ్
- కొన్ని నెలల ముందే అమలు చేసిన మొసాద్ ఏజెంట్లు
- పేజర్లలో ఒక్కోదాంట్లో 3 గ్రాముల పేలుడు పదార్థం అమరిక
లెబనాన్ లో మంగళవారం పేజర్ పేలుళ్లు సంచలనం సృష్టించాయి. దాదాపుగా ఒకే సమయంలో వందలాది పేజర్లు పేలిపోయాయి. హిజ్బుల్ సభ్యులు వాడుతున్న పేజర్లు పేలడంతో 9 మంది చనిపోగా 2,800 మంది గాయపడ్డారు. పేలుళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏకకాలంలో పేజర్లు పేలడం, అదీ హిజ్బుల్ సభ్యుల వద్ద ఉన్న పేజర్లు కావడంతో ఇది పక్కా ప్లానింగ్ తో చేసిన దాడేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది తమ శత్రువు ఇజ్రాయెల్ పనేనని లెబనాన్ ఆరోపిస్తోంది. దీనివెనక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, పేలిన పేజర్లన్నీ ఇటీవల కొనుగోలు చేసినవేనని, అవన్నీ తైవాన్ లో తయారయ్యాయని లెబనాన్ ప్రభుత్వం పేర్కొంది.
కొన్ని నెలల ముందే మొసాద్ ప్లానింగ్
ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాను దెబ్బతీయడానికి మొసాద్ పక్కాగా ప్లాన్ చేసి నిర్వహించిన ఆపరేషన్ ఇదని లెబనాన్ సెక్యూరిటీ సంస్థలు చెబుతున్నాయి. హిజ్బుల్లా సభ్యులు కొంతకాలంగా పేజర్ల ద్వారానే సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థలు ట్యాప్ చేసే అవకాశం ఉందని సెల్ ఫోన్లను దూరం పెట్టారు. సమాచార మార్పిడికి ప్రధానంగా పేజర్లపైనే ఆధారపడుతున్నారు. హిజ్బుల్లా తైవాన్ నుంచి 5 వేల పేజర్లను కొనుగోలు చేసి తన సభ్యులకు అందజేసింది. అయితే, పేజర్ల కొనుగోలు విషయం ముందే ఊహించిన మొసాద్ ఏజెంట్లు.. కొన్ని నెలల ముందే ఆ పేజర్లు ఒక్కోదాంట్లో 3 గ్రాముల శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని చేర్చారు. దీంతో అవన్నీ దాదాపు బాంబులుగా మారిపోయాయి. అనుకున్నట్లే అవి హిజ్బుల్లా సభ్యుల చేతుల్లోకి వెళ్లాయి. తాజాగా మంగళవారం ఆ పేజర్లను మొసాద్ ఏజెంట్లు పేలిపోయేలా చేసి హిజ్బుల్లాను దెబ్బతీశారు.
తైవాన్ పేజర్ల కంపెనీ వివరణ..
తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీకి 5 వేల పేజర్లకు హిజ్బుల్లా ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారం కంపెనీ పేజర్లను డెలివరీ చేసింది. తాజా పేలుళ్ల నేపథ్యంలో ఆ పేజర్ల తయారీ గురించి నిఘా సంస్థలు ఆరాతీయడం మొదలుపెట్టాయి. దీంతో గోల్డ్ అపోలో కంపెనీ వ్యవస్థాపకుడు హుసు చింగ్ కువాంగ్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశాడు. ఆ పేజర్లు తమ కంపెనీలో తయారు కాలేదని చెప్పారు. యూరప్ లోని ఓ కంపెనీ వాటిని తయారుచేసిచ్చిందని, వాటిపై తమ కంపెనీ పేరు ముద్రించి డెలివరీ చేశామని తెలిపారు. ఆ పేజర్లపై పేరు తప్ప మిగతా పరికరాలు వేటితోనూ తమ కంపెనీకి ఎలాంటి సంబంధంలేదని వివరించారు.