*సాగర్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
•మరమత్తు పనుల్లో తీవ్ర జాప్యం
•అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం
•పనులను తీరును పరిశీలించిన మంత్రి తుమ్మల
•సమన్వయ లోపంతోనే పనుల్లో జాప్యం
•పనులు జాప్యంపై మంత్రి ఉత్తమ్ మరియు ఇరిగేషన్ కార్యదర్శి కి ఫోన్
•పంటలు ఎండిపోతున్నాయని రైతుల్లో ఆందోళన
•పంటలకు సాగునీరు విడుదల చేయాలని తుమ్మల ఆదేశం
పాలేరు ఎన్.ఎస్.పీ ఎడమ కాలువ మరమత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, రైతులకు తక్షణమే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కూసుమంచి మండలం మల్లాయిగూడెం వద్ద సాగర్ కాలువ మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువ మరమ్మత్తుల పనుల్లో జాప్యం అధికారుల మధ్య సమన్వయ లోపంపై మంత్రి తుమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్.ఎస్.పీ కాలువ మరమ్మత్తు పనులు నత్త నడకన సాగుతున్న తీరుపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తో మంత్రి మాట్లాడారు. పనులు జాప్యం పట్ల రైతులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇది నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృత్తం అయితే చర్యలు తప్పవన్నారు.సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండిపోతున్నాయని వ్యక్తం చేశారు. ప్రధానంగా వైరా ,కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి ప్రాంతాలలో సాగర్ నీరు రాక పంటలు దెబ్బ తినే అవకాశం ఉందన్నారు. ఈ సమస్యను అధిగమించేలా సర్వశక్తులు ప్రయత్నించాలన్నారు. రైతన్నలకు ఎలాంటి కష్టం నష్టం రాకుండా చూసుకోవడమే మన కర్తవ్యం అన్నారు. రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా మరమ్మత్తులు పూర్తి చేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు లేకుండా సాగునీరు తక్షణమే అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రేపు ఉదయం లోగా పనులను పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.