విలీన గ్రామాల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు…. మంత్రి తుమ్మల
15వ డివిజన్ అభివృద్ధికి కోటి 35 లక్షల మంజూరు
35 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
జాతీయ రహదార్ల ద్వారా ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు ఏర్పాటు
సర్వీస్ రోడ్ల ద్వారా ఖమ్మం పట్టణానికి మరింత వెసలుబాటు
ఖమ్మం నగరంలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఖమ్మం నగరంలోని విలీన గ్రామాల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ అల్లీపురంలో టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధులు రూ. 35 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరంలో ఉంటే అభివృద్ధికి అధిక నిధులు వస్తాయని గతంలో ప్రభుత్వాలను ఒప్పించి విలీనం చేసి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణంలో ఉన్న సౌకర్యాలు ప్రజలకు అందాలని, అన్ని కాలనీలలో కూడా సీసీ రోడ్లు, డ్రైయిన్లు ఉండాలని అన్నారు.
మంచినీటి సరఫరా, విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో పని చేశామని అన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా రోడ్లను డబుల్, ఫోర్ లైన్ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని, జాతీయ రహదారులు ఖమ్మం పట్టణానికి రాకుండా, నేరుగా ఇతర జిల్లాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
దేవరపల్లి, రాజమండ్రి, అమరావతి, విజయవాడ జాతీయ రోడ్లు త్వరలో వస్తాయని, వీటి ద్వారా ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు వచ్చే అవకాశం ఉందని అన్నారు. జాతీయ రోడ్లకు సర్వీస్ రోడ్లు వేసి ఖమ్మం పట్టణానికి మరింత వెసలుబాటు తీసుకొని వస్తామని అన్నారు.
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించు కుంటూ విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు.
తెల్ల రేషన్ కార్డు లేని రైతులను కుటుంబ సర్వే ద్వారా నిర్ధారణ చేసి, రుణమాఫీ పథకం వర్తింప చేస్తామని అన్నారు. 2 లక్షల పైన ఉన్న రుణాలు ఉన్న రైతులకు షెడ్యూల్ ప్రకటించి రెండు లక్షలు పైన ఉన్న మొత్తం కట్టిన వారికి రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని అన్నారు. రుణమాఫీ పూర్తయిన రైతులకు కొత్త అప్పులు వస్తాయని అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలోనే 31 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమే నని అన్నారు. రుణమాఫీ పథకం తర్వాత రైతు భరోసా పథకం అమలు అవుతుందని అన్నారు. రైతుల పంటలకు కూడా పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. రోజుకు 50 కోట్లు ఖర్చు చేసి రైతులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు.
సన్నాలు పండించే రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించామని అన్నారు. క్వింటాల్ కు వెయ్యి రూపాయలు నష్టం వచ్చినప్పటికీ తడిచిన పెసర్లను మద్దతు ధరపై కొనుగోలు చేశామని తెలిపారు. మొక్కజొన్నలు, సోయా, పొద్దు తిరుగుడు, కందులు, ఎర్ర జొన్నలు మొదలగు పంటలకు మార్కెట్ లో ధర లేని సమయంలో వేల కోట్ల నష్టం వచ్చినప్పటికీ రైతులను నిలబెట్టాలని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
15వ డివిజన్ కార్పొరేటర్ కరుణ ప్రతిపాదనల మేరకు విలీన గ్రామాల అభివృద్ధికి కోటి 35 లక్షల మంజూరు చేస్తున్నామని అన్నారు. ఎస్సీ కాలనీలో పూర్తి స్థాయి సిసి రోడ్, డ్రైయిన్లు వేయాలని అన్నారు. పెండింగ్ అభివృద్ధి పనులకు నిధులను త్వరలో మంజూరు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, 15వ డివిజన్ కార్పొరేటర్ రావూరి కరుణ, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, సహాయ కమీషనర్ సంపత్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.