- విద్యార్థులకు ఉచిత పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తామని వెల్లడి
- కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని విజ్ఞప్తి
- చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్టు కొనసాగుతుందని వెల్లడి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమానికి సంబంధించిన జీవోను జారీ చేసినట్లు వెల్లడించారు. చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ దర్శినిని రూపొందించారు.
తెలంగాణ దర్శిని పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ… మన సంస్కృతికి చిహ్నంగా ఉన్న కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యావరణ రంగాన్ని కూడా ముందుకు తీసుకువెళతామన్నారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నగరంలోని ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. అందులో శాసన మండలిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జూబ్లీహాలును కూడా పరిరక్షించాల్సి ఉందన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్‌కు తరలించి ప్రస్తుత భవనాన్ని పరిరక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్టు కొనసాగుతోందని, అలాగే హైకోర్టు భవనం, సిటీ కాలేజీ భవనం, పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలన్నారు.