చెన్నైలో బీఆర్ యస్ ప్రతినిధి బృందం …ఎంపీ వద్దిరాజు బండ ప్రకాష్ , మధు సుధానాచారి
చెన్నైలో ద్రవిడ కజకం కార్యాలయం సందర్శించిన బీఆర్ యస్ నేతలు
బీసీ స్టడీ టూర్ లో నేతలు …తమిళనాడు పరిస్థితులపై ఆరా
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, మండలిలో ప్రతిపక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్,వీ.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ తదితరులతో కలిసి చెన్నైలోని ద్రవిడ కజకం (డీకే) కార్యాలయాన్ని సందర్శించారు
బీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మార్గనిర్దేశనం,వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు సూచన మేరకు పార్టీకి చెందిన బీసీ నాయకులతో కూడిన 40మంది ప్రతినిధుల బృందం తమిళనాడులో వెనుకబడిన కులాల సామాజిక, ఆర్థిక,రాజకీయ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు గాను గురువారం చెన్నై వెళ్లిన విషయం తెలిసిందే
ఈ బృందం గురువారం తమిళనాడు ప్రభుత్వ బీసీ,ఎంబీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ రాజా కుమార్, కమిషనర్ వెంకటేష్ తదితర ఉన్నతాధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది
అలాగే,ఈ బృందం శుక్రవారం ఉదయం తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రాంమోహన్,బీసీ సంఘాలకు చెందిన పలువురు నాయకులతో సమావేశమై చర్చలు జరిపింది
కాగా, ఎంపీ రవిచంద్ర,ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, మధుసూదనాచారి,మాజీ మంత్రులు కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మధుకర్ తదితర ప్రముఖులు శుక్రవారం సాయంత్రం ద్రవిడ కజకం కార్యాలయాన్ని సందర్శించి ద్రావిడ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వీరమణితో సమావేశమయ్యారు
ద్రావిడ ఉద్యమం పుట్టుక,దాని పూర్వాపరాలు, తదనంతర పరిణామాలు, వెనుకబడిన కులాల సమున్నతికి దోహదపడిన అంశాల గురించి బీఆర్ఎస్ నాయకులు డీకే అధ్యక్షులు వీరమణిని అడిగి తెలుసుకున్నారు
ద్రావిడ ఉద్యమానికి మూల పురుషుడు స్వర్గీయ పెరియార్ రామస్వామి నాయకర్ ఫోటోలు,ఆయన ఉపయోగించిన వస్తువుల ప్రదర్శనను బీఆర్ఎస్ నాయకులు ఆసక్తి తిలకించారు, ఉద్యమచరిత్రను డీకే అధ్యక్షులు వీరమణి బీసీ ప్రముఖులకు వివరించారు
ఈ సందర్భంగా పెరియార్ రామస్వామి నాయకర్ విగ్రహం వద్ద బీసీ ప్రముఖులు ఫోటోలు దిగారు
చెన్నై పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు గురువారం వీరనారి చిట్యాల ఐలమ్మ, శుక్రవారం త్యాగధనులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతుల సందర్భంగా వారి చిత్రపటాలకు పూలుజల్లి ఘనంగా నివాళులర్పించారు