ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలి…మంత్రి పొంగులేటి!
అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8 వరకు పైలెట్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే నిర్వహణ
అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ విస్తరణ, నూతన యూ.డి.ఏ. ఏర్పాటు ప్రతిపాదనలు సమర్పించాలి
ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి
సజావుగా ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు
ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఎల్.ఆర్.ఎస్, యూ.డి.ఏ. తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన మంత్రి
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను సమర్థ వంతంగా అమలు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మంగళవారం వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్లతో, మంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో సమీక్షలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ లు డా.పి. శ్రీజ, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి పాల్గొన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు అమలుపై తదితర అంశాలను ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారులు రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి, ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన, వీటి వల్ల వచ్చే ఫలితాలపై నివేదిక అందించారని తెలిపారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 గ్రామ పంచాయతీలు లేదా 1 గ్రామ పంచాయతీ, 1 డివిజన్ తీసుకుని పైలెట్ విధానం ద్వారా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అమలు చేయాలని అన్నారు. అక్టోబర్ 3న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, అక్టోబర్ 8న సాయంత్రం నాటికి ఫైలెట్ మోడ్ లో వివరాలతో నివేదిక అందించాలని అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అమలులో వచ్చే లోపాలను సవరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఈ కార్డు కీలకం అవుతుందని అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించామని, డిజిటల్ కార్డులో వివరాల నమోదుకు సంబంధించి ఐటీ పరమైన అంశాల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు నిపుణులు కేటాయిస్తామని అన్నారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే వివరాలు ఎప్పటికప్పుడు కంప్యూటర్ లో నమోదు చేయాలని అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో జారీలో ఎదురయ్యే ఇబ్బందులను పైలెట్ ప్రాజెక్టుల ద్వారా తెలుసుకొని వాటిని సవరించాలని అన్నారు.
ఎల్.ఆర్.ఎస్. సంబంధించి ఆశించిన మేర ఫలితం రాలేదని, ప్రభుత్వం పాలసీ పరమైన నిర్ణయం తీసుకుని 3 నెలలు గడిచిందని, ఇప్పటికీ దరఖాస్తుల పరిష్కారం చేయకపోవడానికి గల కారణాలను తెలియజేయాలని అన్నారు. ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులకు సంబంధించి అర్హులను మాత్రమే ఆమోదించాలని అన్నారు.
జిహెచ్ఎంసి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దసరా కంటే ముందు లబ్ధిదారులను ఫైనల్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి చైర్మన్, కలెక్టర్ కన్వీనర్ గా కమిటీ ఏర్పాటు చేసుకొని లబ్ధిదారుల ఎంపిక జరగాలని అన్నారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి సన్న వడ్ల కొనుగోలు సందర్భంగా ప్రభుత్వ మార్గదర్శకాలను పకడ్బందీగా పాటించాలని, ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న సన్న వడ్లను బియ్యంగా మార్చి జనవరి మాసం నుంచి సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తామని, నాణ్యత అంశంలో ఎక్కడా రాజీ పడవద్దని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ కుటుంబంలో ఉన్న మహిళ పేరు మీద ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక వ్యక్తి ఒకే కుటుంబంలో ఉండే విధంగా ఫ్యామిలీ కార్డుల రూపకల్పన ఉండాలని, రెండు కార్డులలో ఒకరి పేరు రావద్దని అన్నారు.
అక్టోబర్ 3 నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 2 ప్రాంతాలను పైలెట్ క్రింద ఎంపిక చేసుకొని ఫ్యామిలీ డిజిటల్ కార్డు అమలు చేయాలని, దీనికోసం అర్బన్ ప్రాంతాల్లో ఆర్.డి.ఓ, రూరల్ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయిని గుర్తించి వారి పర్యవేక్షణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అమలు కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.
అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8 వరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు వివరాలు సేకరణ పూర్తి కావాలని, దీనికి అనుగుణంగా గ్రామాలు, పట్టణ వార్డు లోని కుటుంబాల సంఖ్య ఆధారంగా అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకోవాలనీ సీఎస్ కలెక్టర్ కు సూచించారు.
పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసిన గ్రామాలు డివిజన్ నుంచి ప్రతి కుటుంబం వివరాలు సేకరించి వివరాల నమోదు చేయాలని అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రతి కుటుంబానికి రావాలని, ఆదాయ పరిమితి తో సంబంధం లేదని అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విస్తరణ, నూతన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీరూపకల్పనకు ప్రతిపాదనలు సమగ్ర సమాచారంతో అందించాలని సీఎస్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో ఏజెన్సీ ఏరియాలను కలుప వద్దని అన్నారు.
ఎల్.ఆర్.ఎస్. పెండింగ్ దరఖాస్తులను ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అర్హులైన లేఔట్ క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని అన్నారు. లేఔట్ క్రమబద్ధీకరణ సమయంలో చెరువుల బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్. పరిధిలో ఉంటే క్రమబద్ధీకరణ చేయవద్దని, దీనికి సంబంధించి నీటి పారుదల శాఖ అధికారుల మద్దతు తీసుకోవాలని అన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్.డి.ఆర్.ఎఫ్. మార్గదర్శకాల ప్రకారం మరమ్మత్తుకు గురైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, కమ్యూనిటీ భవనాలు మొదలగు భవనాల వివరాలు పకడ్బందీగా అందజేయాలని, ఆ వివరాల ప్రకారం బడ్జెట్ విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే చర్యలు తీసుకునేందుకు విడుదల చేసిన నిధులను పరిహారం అందించేందుకు, అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టేందుకు, ప్రజా సంచార ప్రదేశాల్లో చెత్త తొలగింపుకు, త్రాగునీటి పైప్ లైన్ పనుల పునరుద్ధరణ పనులకు వినియోగించాలని అన్నారు.
ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ నుంచి సన్న వడ్లకు ప్రభుత్వం క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని అన్నారు. సన్న వడ్ల కొనుగోలుకు క్వింటాల్ కు 500 రూపాయలు అధికంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
సన్న ధాన్యం, దొడ్డు ధాన్యం కొనుగోలు కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అక్టోబర్ 15 నాటికి పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అవసరమైన మౌళిక వసతులను కల్పించాలని అన్నారు. సన్న వడ్ల గుర్తింపు ప్రభుత్వ మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా పాటించాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ కోసం ఖమ్మం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని, అసెంబ్లీ నియోజకవర్గంలో కేటాయించిన బృందాలకు అవసరమైన అవగాహనను వెంటనే అందజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు ఇళ్ల లక్ష్యాలను కేటాయించి ఉదయం, సాయంత్రం వారి పనితీరు పర్యవేక్షించాలని, ఇంటింటికి తిరిగి ఆఫ్ లైన్ లో పూర్తి వివరాలు సేకరించి సర్వే చేపట్టాలని, దీనికి తగిన విధంగా అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి రాజేశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, ఆర్డీవోలు గణేష్, రాజేందర్, మునిసిపల్ కమిషనర్లు రవిబాబు, వేణు, అహ్మద్ షఫీఉల్లా, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.