- ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో విమానం టేకాఫ్
- ఆ వెంటనే బాంబు బెదిరింపు
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానానికి తనిఖీలు
ముంబై నుంచి ఈ తెల్లవారుజామున న్యూయార్క్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి మళ్లించాడు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, ప్రస్తుతం విమానంలో తనిఖీలు జరుగుతున్నట్టు అధికారి ఒకరు తెలిపారు.
తెల్లవారుజామున 2 గంటల సమయంలో ముంబైలోని చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది. ఆ వెంటనే విమానంలో బాంబు ఉందంటూ హెచ్చరికలు రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే దానిని ఢిల్లీకి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశాడు.
విమానం ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది. సెక్యూరిటీ సిబ్బంది విమానాన్ని తనిఖీ చేస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.