మధుకాన్ షుగర్స్ లో ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ నిర్వహణ
ఎండీ నామ కృష్ణయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఎంపీ నామ
నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలోని మధుకాన్ షుగర్స్ & పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో సోమవారం సాయంత్రం అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిఆర్ ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, నామ సోదరులు నామ రామారావు, నామ శీతయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం మధుకాన్ షుగర్స్ ఎండీ నామ కృషయ్య స్వామి నేతృత్వంలో, పాక తిల్లం నారాయణ నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్పస్వామికి పుష్పాలంకరణ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద మండపాలు… పుష్పాల అలంకరణ, విద్యుత్ కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
స్వామి వారి పడిపూజకు హాజరైన గాయకుడు జి. శ్రీనివాస్ కుమార్ (డప్పు శ్రీను గురు స్వామి) ఆలపించిన అయ్యప్ప స్వామి పాటలు భక్తులందరినీ ఆకట్టుకున్నాయి.
“స్వామియే శరణం అయ్యప్ప”, “శరణం శరణం అయ్యప్ప” అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో రాజేశ్వరపురం మార్మోగింది. ఈ మహాపడి పూజ మహోత్సవానికి పెద్దఎత్తున అయ్యప్ప భక్తులు, స్వాములు హాజరై అయ్యప్ప నామస్మరణ, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం స్వామి వారికి ప్రసాదం పంపిణీ చేసి పూజా కార్యక్రమాలను ముగించారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరావు మాట్లాడుతూ అయ్యప్పస్వామి దీక్ష ఎంతో పవిత్రమైనదని… భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించే స్వాములుకు దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుందన్నారు. అయ్యప్ప స్వామి పూజలు భక్తులను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతాయని, ఈ పూజలో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ శాంతి, ఆనందం పొందారని తెలిపారు. నామ కృష్ణయ్య స్వామి అయ్యప్ప స్వామి వారి పాద సేవలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చెరకు రైతులు, ఫ్యాక్టరీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.