- హరీశ్‌రావుతో బహిరంగ చర్చకు రేవంత్‌రెడ్డి అవసరం లేదన్న మంత్రి జూపల్లి
- ఆ సవాల్‌కు తాను సిద్ధమని ప్రకటన
- కాంగ్రెస్ బిక్షతోనే నాడు హరీశ్ మంత్రి అయ్యారన్న జూపల్లి
- మూసీ నిర్వాసితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపాటు
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మల్లన్న సాగర్‌పై చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు సవాల్ చేయడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఆయన సవాల్‌కు రేవంత్ రావాల్సిన అవసరం లేదని, దానిని తాను స్వీకరిస్తున్నానని అన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులు, అవినీతి, ఎవరెంతగా దోచుకున్నారో ఆ పార్టీ నేతలతో చర్చించడానికి తాను సిద్ధమని మంత్రి జూపల్లి అన్నారు.
తనతో చర్చకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులలో ఎవరు వస్తారో రావాలని జూపల్లి సవాల్ విసిరారు. ఎల్బీ స్టేడియంలో ప్రజలు, మీడియా ముందు బహిరంగ చర్చ పెడదామని, అన్ని అంశాలు చర్చిద్దామని అన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి ఆధారాలతో సహా బయట పెడతానన్నారు. ఢిల్లీకి కప్పం గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ఢిల్లీకి డబ్బులు పంపింది మీరు కాదా? పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బులు పంపింది మీరు కాదా ? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ గొప్ప నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.
పదేళ్లలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతల ఆస్తులు భారీగా పెరిగాయని జూపల్లి ఆరోపించారు. హరీశ్ గతంలో కాంగ్రెస్ భిక్షతోనే మంత్రి అయ్యారని గుర్తు చేశారు. మూసీ నిర్వాసితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తే వారికి రాజకీయంగా మాట్లాడటానికి ఏమీ ఉండదని కేటీఆర్, హరీశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో తన ఇల్లు కూడా పోతుందని మంత్రి జూపల్లి తెలిపారు.