- రష్యా భూభూగంలో అమెరికా ఆయుధాలతో దాడికి అనుమతి
- గతంలో విధించిన ఆంక్షలను బైడెన్ సర్కార్ ఎత్తివేసినట్టుగా సమాచారం
- మరో రెండు నెలల్లో ట్రంప్ ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో కీలక పరిణామం
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌పై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మరో రెండు నెలల్లో ట్రంప్ సర్కారు కొలువుదీరనుంది. ఇదిలావుంచితే.. పదవి నుంచి దిగిపోవడానికి 2 నెలల ముందు అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా భూభాగంలో దాడులకు అమెరికా ఆయుధాలను ఉపయోగించకుండా ఉక్రెయిన్‌పై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేసినట్టుగా తెలుస్తోంది. ఉక్రెయిన్-రష్యా వివాదంలో అమెరికా విధానంలో ఇది చాలా కీలకమైన మార్పు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కాగా ఉక్రెయిన్ రాబోయే కొన్ని రోజుల్లోనే తొలిసారి ధీర్ఘ శ్రేణి దాడులను నిర్వహించాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 190 మైళ్ల (306 కి.మీ) పరిధిలోని లక్ష్యాలను ఛేదించే ఏటీఏసీఎంఎస్ రాకెట్‌లను ఉక్రెయిన్ ఉపయోగించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ కథనాలపై స్పందించేందుకు ‘వైట్‌హౌస్’ నిరాకరించింది.
రష్యా సైనిక లక్ష్యాలను ఛేదించడానికి అమెరికా ఆయుధాలను ఉపయోగించేలా తమ మిలిటరీకి అనుమతి ఇవ్వాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొన్ని నెలలుగా అగ్రరాజ్యాన్ని అభ్యర్థిస్తున్నారు. రష్యా తన సొంత బలగాలతో పాటు ఉత్తర కొరియా దళాలను కూడా మోహరించిన నేపథ్యంలో జెలెన్స్కీ అమెరికాను ఆశ్రయించారు. ఉత్తరకొరియా సేనలను కూడా మోహరించడం పట్ల అమెరికా, ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామంపై రష్యా ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.