- డబుల్ సెంచరీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్
- కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరపున అడిన ఆర్యవీర్
- మొత్తం 229 బంతులు ఎదుర్కొని 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఆర్యవీర్
భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ (వీరూ) ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాజీ ప్లేయర్ పేరు వింటేనే ప్రత్యర్ధి బౌలర్లకు హడల్. ఫోర్లు, సిక్సులతో తమ మీద పిడుగులా పడతాడని ప్రత్యర్ధి ఆటగాళ్లు భయపడేవారు. అతనికి బౌలింగ్ చేయాలంటే చేతులు తిరిగిన బౌలర్లు కూడా జడుసుకునే వారు.
అందుకే పదవీ విరమణ అయినా సెహ్వాగ్.. ఇంకా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాడు. వీరూ వారసత్వాన్ని కొనసాగిస్తూ అతని తనయుడు ఎంట్రీ ఇచ్చాడు. డబుల్ సెంచరీతో తన ఆగమనాన్ని సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ ఘనంగా చాటుకున్నాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరపున బరిలో దిగిన ఆర్యవీర్ మేఘాలయతో మ్యాచ్‌లో మొత్తం 229 బంతులు ఎదుర్కొని 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇందులో రెండు సిక్స్‌లతో పాటు ఏకంగా 34 బౌండరీలు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే ఆర్యవీర్ 148 పరుగులు చేయడం విశేషం. ఆర్యవీర్ బాదుడు చూసి తండ్రికి తగ్గ తనయుడు అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతడు ఇదే ఆట తీరును కొనసాగిస్తే మరి కొన్ని సంవత్సరాల్లో టీమిండియాలోకి అడుగుపెట్టడం ఖాయమన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి.