రేవంత్ రెడ్డికి రామ్మోహన్ నాయుడు హామీ
- ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన తెలంగాణ సీఎం
- వరంగల్ విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి
- భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం కావాలన్న సీఎం
- నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్న రామ్మోహన్ నాయుడు
తెలంగాణలో భూసేకరణ ఎంత త్వరగా పూర్తైతే అంత త్వరగా ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఈరోజు కేంద్రమంత్రితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్ విమానాశ్రయ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు.
స్పందించిన కేంద్రమంత్రి… భూసేకరణ ఎంత వేగంగా చేపడితే అంత త్వరగా విమానాశ్రయ నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాల్లోనూ విమానాశ్రయ నిర్మాణాలు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఆయా ప్రాంతాల్లో విమానాశ్రయ నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు.
తెలుగువాడిగా రెండు రాష్ట్రాలను సమానంగా చూస్తా
సీఎం రేవంత్ రెడ్డితో పలు విమానాశ్రయ నిర్మాణాలు, స్థలాలపై చర్చించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా వరంగల్ విమానాశ్రయం త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు. ఒక తెలుగువాడిగా తనకు అవకాశం ఉన్నందున… ఏపీతో పాటు తెలంగాణను సరిసమానంగా చూస్తానని, ఎక్కడ విమానాశ్రయాలు అవసరమో చూస్తామన్నారు. రెండు రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా చిత్తశుద్ధితో ఉన్నారన్నారు.