Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

అదానీ దోషి అని అమెరికా చెబుతున్నా విచారణ ఉండదు… అరెస్టు ఉండదు: షర్మిల

  • నేడు భారత రాజ్యాంగ దినోత్సవం
  • విజయవాడలో షర్మిల పాదయాత్ర
  • దేశంలో బీజేపీ రాజ్యాంగం అమలవుతోందంటూ వ్యాఖ్యలు

నేడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్, మణిపూర్ వంటి చోట్ల మైనారిటీలకు స్వేచ్ఛ లేదని అన్నారు. ఇంతమందిని ఊచకోత కోశారంటే…. దేశంలో లౌకికవాదమే ఉండకూడదని మోదీ, ఆర్ఎస్ఎస్ వాదులు చేస్తున్న కుట్రే కారణమని విమర్శించారు. 

దేశంలో బీజేపీ రాజ్యాంగం అమలవుతోందని వ్యాఖ్యానించారు. సమానత్వం ఉండాలని రాజ్యాంగం చెబుతుంటే, ఏమాత్రం అమలు చేయని పార్టీ బీజేపీ అని అన్నారు. 

“కొంతమంది చేతుల్లోనే మొత్తం డబ్బంతా ఉండాలి… వాళ్లకు అనుకూలమైన వ్యాపారస్తుల చేతుల్లోనే అన్ని వ్యాపారాలు ఉండాలి… అదానీ వాళ్ల మనిషి కాబట్టి అదానీని పదేళ్లలోనే ఆకాశానికి ఎత్తేయొచ్చు, అదానీ ఏ తప్పులు చేసినా విచారణే ఉండదు, అరెస్టులే ఉండవు. ఆఖరికి ఎఫ్ బీఐ వాళ్లయినా, అమెరికా వాళ్లయినా అదానీ దోషి అని ఆధారాలతో చూపినా ఒక్క ఎంక్వైరీ కూడా వేయరు. ఇదీ… బీజేపీ అనుసరిస్తున్న రాజ్యాంగం! 

సామాజిక న్యాయం అని మన రాజ్యాంగం చెబుతుంటే… సామాజిక న్యాయం కాదు కదా… ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసలు మనుషులుగానే చూడవు. ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తారు. ఓట్ల కోసం వాడుకుంటారు. ఇప్పటికైనా ఆ వర్గాలకు న్యాయం చేయాలని, కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా ఆ వైపు అడుగులు వేయడంలేదు. అందుకు కారణం బీజేపీ రాజ్యాంగం. 

మేం కానీ, మా నాయకుడు రాహుల్ గాంధీ కానీ కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ కులానికైనా, ఏ వర్గానికైనా వాళ్లకు అందాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమీ, వాళ్లకు అందాల్సిన ఉద్యోగ అవకాశాలు అయితేనేమీ, వాళ్లకు చట్టసభల్లో కల్పించాల్సిన అవకాశాలైతేనేమీ… కులగణన ద్వారానే అన్నింటిపైనా స్పష్టత వస్తుంది” అని షర్మిల పేర్కొన్నారు.

Related posts

18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన.. ఇక మిగిలింది మూడే!

Ram Narayana

వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్

Ram Narayana

లోకేశ్‌కు కనీసం రెండు నిమిషాల సమయమివ్వలేదు, పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలి: సీపీఐ రామకృష్ణ

Ram Narayana

Leave a Comment