- రఘరామను కస్టడీలో చిత్రహింసలు పెట్టినట్టు విజయపాల్ పై ఆరోపణలు
- ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ
- విచారణకు హాజరైన విజయపాల్
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గత ప్రభుత్వ హయాంలో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో… ఆయనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారని సీఐడీ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా, సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ దీనికి సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు.
ఇవాళ విజయపాల్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కాగా… సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు… ఆయనను అరెస్ట్ చేశారు! రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారిగా ఉన్నారు.
విజయపాల్ నవంబరు 13న పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కానీ ఆయన నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం సేకరించలేకపోయారు. దాంతో ఇవాళ కూడా విచారించి, అరెస్ట్ చేశారు.
విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విజయపాల్ స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఆయన అరెస్ట్ కు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది.