చెడు వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్ కోల్పోతాం.. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ కాదు మీ అన్న గా చెబుతున్న
తల్లిదండ్రులు పిల్లల నడవడికలను నిత్యం గమనించాలి.
మత్తు పదార్థాల నిర్మూలన పై విద్యార్దులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్
యువత భవిష్యత్తును, కుటుంబ జీవితాలను హరిస్తున్న గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటుపడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం ఖమ్మం ఎస్.బీ.ఐ.టి కళాశాలలో యువ సంకల్పం, మాదక ద్రవ్యాలు నిర్మూలన వంటి అంశాలతో ఏర్పాటు చేసిన అవగహన సదస్సు కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాదక ద్రవ్యాల నిర్మూలన విద్యార్థులకు గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్, మత్తు పానీయాల వలన జరిగే అనర్థాల గురించి, గంజాయిని విద్యార్థులకు అలవాటు చేసే తీరు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై కలెక్టర్ వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల యువత గంజాయి తదితర మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, గంజాయి, డగ్స్ వినియోగం పెరగడం, విద్యార్థులు, యువత వాటి బారిన పడటం ఆందోళనకరమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లు, కదలికలపై జాగురూకతతో వ్యవహరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
మత్తు పదార్థాల వల్ల యువత శారీరకంగానూ, మానసికంగానూ తీవ్రంగా బలహీన పడిపోతారని, భవిష్యత్తు నాశనం అవుతుందని, ఇటువంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గా కాదు.. మీ అన్న గా చెబుతున్న అని హితవు పలికారు. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని, మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని అన్నారు.
మాదక ద్రవ్యాలతో అనారోగ్యం పాలై జీవితం అంధకారమవుతుందని అన్నారు. క్రమశిక్షణతో కూడిన చదువు వలన ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ మత్తులో యువత నేడు అనేక నేరాలు చేస్తున్నారని తెలిపారు.
మాదక ద్రవ్యాల సేవనం, ఎవరికైనా అక్రమ మత్తు పదార్థాల తయారీ కానీ, రవాణా గురించి గానీ తెలిస్తే టోల్‌ఫ్రీ నెంబర్ తెలియజేయాలని కోరారు. మత్తు బారి నుంచి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని తెలిపారు.
మత్తు పదార్థాలకు అలవాటు పడితే బయటకు రావడం కష్టమని అందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఏ రంగంలో ప్రతిభ చాటవచ్చో గుర్తించి అటువైపు ప్రయాణించేలా దృష్టి పెట్టాలన్నారు. జీవితంలో ఏది సాధించాలన్నా కృషి, పట్టుదల అవసరమని అన్నారు.
ప్రజలను విద్యార్థులే ముందుండి చైతన్యపర్చాలన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే మనస్సు మన ఆధీనంలో ఉండదన్నారు. అలాంటి వారికి కౌన్సెలింగ్ ఇస్తామని, గంజాయిని అమ్మే వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామ న్నారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్షణం చేసే తప్పుతో జీవితాంతం పోలీస్‌స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. గంజాయికి అలవాటుపడి మానుకోలేని పరిస్థితి ఉన్న వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉచితంగా కౌన్సిలింగ్ అందిస్తారని చెప్పారు. మత్తు పదార్థాలు వినియోగాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలపై విద్యార్ధులకు కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, కళాశాల కరస్పాండెంట్ ఆర్జేసీ కృష్ణ, జిల్లా బాలల సంరక్షణ అధికారిణి విష్ణు వందన, కళాశాల అధ్యాపకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.