- గతేడాది వారణాసి వీధుల్లో ‘వన్‌వాస్’ సినిమా షూటింగ్
- సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన అభిమాని తలపై కొట్టిన నానాపటేకర్
- వీడియో వైరల్ కావడంతో వెల్లువెత్తిన విమర్శలు
- ఆ రోజు అలా ప్రవర్తించి ఉండకూడదన్న నటుడు
గతేడాది అభిమానిపై చేయి చేసుకున్న ఘటనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అతడితో అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని పేర్కొన్నారు. గతేడాది వారణాసి వీధుల్లో ‘వన్‌వాస్’ షూటింగ్ జరిగింది. దీంతో చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓ యువకుడు నానా పటేకర్ వద్దకు వెళ్లి ఆయనతో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. దీంతో అసహనానికి గురైన నటుడు యువకుడి తలపై గట్టిగా కొట్టారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో నానాపటేకర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా ఈ ఘటనపై స్పందించిన ఆయన జరిగిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. యువకుడికి క్షమాపణలు చెప్పారు. నాడు ఏం జరిగిందన్న విషయాన్ని ఆయన వివరిస్తూ.. తనతో సెల్ఫీ తీసుకునేందుకు ఓ యువకుడు వచ్చాడని, అప్పుడు తాను షాట్‌లో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. తోటి నటీనటులందరూ సీన్‌లో బిజీగా ఉండటం, అదే సమయంలో యువకుడు వచ్చి తన పక్కన నిల్చుని ఫొటో తీసుకుంటుంటే కోపంతో కొట్టానని, అది వివాదమైందని చెప్పారు. తాను అలా చేయడం తప్పేనని, అతడు ప్రేమతో సెల్ఫీ తీసుకునేందుకు వచ్చాడని పేర్కొన్నారు. తాము షాట్‌లో ఉన్న విషయం అతడికి తెలియదని చెప్పారు. షూట్ పూర్తయ్యాక అతడు వచ్చి ఉంటే బాగుండేదని, అప్పుడు ఏ సమస్యా ఉండేది కాదని వివరించారు. కాగా, శ్రుతి మరాఠే, అశ్విని కల్సేకర్ కీలక పాత్రల్లో నటించిన ‘వన్‌వాస్’ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది.