రైతుల డిమాండ్లను వెంటనే అమలు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్
రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షం
మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తోలి ఉద్యమంలో 700 మంది చనిపోయారు
పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
స్వామినాథన్ సిపార్సలను అమలు చేయాలి
రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని, రైతుల డిమాండ్లను వెంటనే అమలు పరచాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళనలపై స్పందించిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. రైతులు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచేందుకు ఢిల్లీకి వచ్చారని, తమ బాధను చెప్పాలనుకున్న వారిపై బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, వారిని అడ్డుకునేందుకు రకరకాలుగా ప్రయత్నించడం ఖండించదగినది అని అన్నారు. అలాగే వారి డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అంతేగాక నేడు దేశంలో గంటకు ఒక రైతు బలవన్మరణానికి పాల్పడుతున్నారంటే రైతుల బాధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని వివరించారు. మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా.. తొలి రైతు ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు బలిదానం చేసుకున్న సంగతిని దేశం మరిచిపోలేదని గుర్తు చేశారు. రైతుల బాధలను అర్థం చేసుకొని, వారి డిమాండ్‌లకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. చట్టపరమైన హామీ అయినఎంఎస్‌పి, స్వామినాథన్ కమీషన్ సిఫారసుల మేరకు సాగుకు అయ్యే సమగ్ర వ్యయానికి 1.5 రెట్లు ఎంఎస్‌పీ, రుణమాఫీ సహా అన్ని డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.