- శనివారం ఏకంగా రూ.115 కోట్లు కొల్లగొట్టిన మూవీ
- మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన వైనం
- హిందీ రాష్ట్రాల్లో పుంజుకున్న కలెక్షన్లు
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప- 2’ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. శనివారం వీకెండ్ కావడంతో ఈ సినిమా అదిరిపోయే రేంజ్‌లో వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కలెక్షన్లు పుంజుకున్నాయి. శనివారం ఒక్క రోజే ఏకంగా రూ.115 కోట్లు రాబట్టిందని సినిమా కలెక్షన్ల వివరాలు అందించే ‘శాక్‌నిల్స్’ కథనం పేర్కొంది. అత్యధికంగా హిందీ వెర్షన్ రూ. 73.5 కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 31.5 కోట్లు, తమిళంలో రూ. 7.5 కోట్లు వసూలు చేసిందని వెల్లడించింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల కలెక్షన్ల మైలురాయిని ఈ సినిమా అధిగమించినట్టు అయ్యింది. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారతీయ చిత్రంగా ‘పుష్ప- 2’ నిలిచింది.
ఓవర్సీస్‌లోనూ అదే జోరు
ఓవర్సీస్ కలెక్షన్లలో కూడా పుష్ప- 2 జోరు కొనసాగుతోంది. ఆరంభంలో బుకింగ్స్ తక్కువగానే అనిపించినా వీకెండ్‌లో సినిమా పుంజుకుంది. ఉత్తర అమెరికాలో దేవర ఆల్ టైమ్ 6,078,545 డాలర్లు వసూలు చేయగా.. పుష్ప- 2 మూడు రోజుల్లోనే దీనిని అధిగమించినట్టు కథనాలు పేర్కొంటున్నాయి. 8 మిలియన్ డాలర్లకు చేరువైందని తెలిపాయి. కాగా 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్‌గా ‘పుష్ప -2’ విడుదలైంది. ప్రధాన తారాగణంతో పాటు సునీల్, అనసూయ భరద్వాజ్, జగపతి బాబుతో పాటు పలువురు నటులు కీలక పాత్రలు పోషించారు.