Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబుకు సంపద సృష్టించే శక్తి లేదు: జగన్

  • సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు
  • చంద్రబాబు పాలించిన ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ లోటేనని వెల్లడి
  • ఇప్పుడు విజన్-2047 పేరుతో మరో కట్టుకథ చెబుతున్నారంటూ ట్వీట్

చంద్రబాబు ముఖ్యమంత్రిగా పరిపాలించిన ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో రెవెన్యూ లోటు కనిపించిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఆయన 14 ఏళ్ల పాలనా కాలంలో ఒక్క ఏడాదైనా మిగులు ఆదాయం కనిపించిందా? మరి ఇంకెక్కడ సంపద సృష్టి? అంటూ ధ్వజమెత్తారు. 

చంద్రబాబుకు సంపద సృష్టించే శక్తి లేదని, సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదని తెలిపారు. ఇప్పుడు విజన్-2047 డాక్యుమెంట్ ద్వారా ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లు చేస్తానంటూ చంద్రబాబు కట్టుకథ చెబుతున్నాడని మండిపడ్డారు. 

మామూలుగానే ఏ రాష్ట్రంలో అయినా కాలం గడిచే కొద్దీ ఆర్థిక వ్యవస్థ కొంచెం పెరుగుతుందని… కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని బాబు గారు మాత్రం, ఆ పెరుగుదల తన వల్లేనని చెప్పుకుంటుంటారని విమర్శించారు. సంపద సృష్టి అటుంచి ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపదను ఆవిరి చేస్తుంటాడని వివరించారు. ప్రభుత్వంలో సృష్టించిన ఆస్తులను చంద్రబాబు తన వారికి అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. 

పేదరిక నిర్మూలన అమలు కార్యక్రమాలన్నింటినీ తీసివేసి… పేదలను మరింత పేదలుగా తయారుచేస్తున్నాడని… మరి చంద్రబాబుకు విజన్ ఉందని ఎలా అనుకుంటారు? అంటూ జగన్ ధ్వజమెత్తారు. 

“విజన్-2047 పేరిట చంద్రబాబు మరోసారి పబ్లిసిటీ స్టంట్ కు దిగారు. ప్రజలను మాయచేయడానికి ఇదొక ఎత్తుగడ. 1998లో కూడా చంద్రబాబు ఇలాగే విజన్-2020 పేరిట డాక్యుమెంట్ తెచ్చారు. రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయం. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, పనుల కోసం వలసలు వెళ్లారు, ఉపాధి లేక, ఉద్యోగాల్లేక ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. వీటన్నింటినీ దాచిపెట్టి చంద్రబాబు తన విజన్ కోసం నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదు. 

అప్పటి స్విట్జర్లాండ్ ఆర్థికమంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సమయంలో… ఇలా విజన్ డాక్యుమెంట్ల పేరిట అబద్ధాలు చెబితే మా దేశంలో అయితే జైలుకు గానీ, ఆసుపత్రికి గానీ పంపిస్తామని అన్నారు. చివరికి ప్రజలు కూడా ఆ డాక్యుమెంట్ ను వ్యతిరేకించారు. 2014లోనూ చంద్రబాబు విజన్-2029 అన్నారు… అది కూడా ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది” అని జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు భారీ ట్వీట్ చేశారు.

Related posts

జనసేనకు మరో షాక్.. కైకలూరు పార్టీ సమన్వయకర్త రాజీనామా..!

Ram Narayana

ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక దినం: చంద్రబాబు

Ram Narayana

గుంటూరు వైసీపీలో విభేదాలు.. ఎమ్మెల్యే, మేయర్ మధ్య వాగ్వాదం

Ram Narayana

Leave a Comment