- పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
- అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష
- రాష్ట్రానికి పోలవరం గేమ్ చేంజర్ అవుతుందని ధీమా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని తెలిపారు. ఒకేసారి 32 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి వరల్డ్ రికార్డు సృష్టించామని చంద్రబాబు వెల్లడించారు.
గతంలో డయాఫ్రం వాల్ ను 414 రోజుల్లో పూర్తి చేశామని అన్నారు. జర్మనీకి చెందిన బాయర్ సంస్థ డయాఫ్రం వాల్ నిర్మించిందని వివరించారు. 2014-19 మధ్య 72 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ ను మార్చేసి, ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరం డ్యామ్ ను గోదాట్లో కలిపేశారని మండిపడ్డారు.
పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్ల వంటివని చంద్రబాబు అభివర్ణించారు. పోలవరం పూర్తయితే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 7 లక్షల ఎకరాలతో కొత్త ఆయకట్టు వస్తుందని తెలిపారు. 23 లక్షల ఎకరాల భూమి స్థిరీకరణ చెందుతుందని పేర్కొన్నారు. పోలవరం ద్వారా విశాఖ పారిశ్రామిక అవసరాలు కూడా తీరతాయని చెప్పారు.