- మంత్రుల పనితీరు పర్యవేక్షిస్తున్నానన్న సీఎం
- పలువురు మంత్రులు టెక్నాలజీ వాడటం లేదంటూ అసంతృప్తి
- జిల్లా ఇన్‌ఛార్జులుగా ఉన్న మంత్రులు మూడు పార్టీల సమన్వయ బాధ్యతలను తీసుకోవాలన్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సున్నితంగా క్లాస్ పీకారు. మంత్రులు ఎవరెవరు ఎలా పని చేస్తున్నారో అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని, ఎప్పటికప్పుడు పనితీరుపై సమీక్షిస్తున్నానని సున్నితంగా హెచ్చరించారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
మంత్రులు సచివాలయానికి, క్యాంప్ కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఇన్‌చార్జులుగా ఉన్న జిల్లాల్లో కూడా విస్తృతంగా పర్యటించాలని తెలిపారు. కొందరు దస్త్రాల పరిష్కారంలో జాప్యం చేస్తున్నారని, టెక్నాలజీ వాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు నెలల పనితీరుపై నివేదిక ఇవ్వాలని కోరితే మంత్రులు రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు.
రాజకీయ సమస్యల పరిష్కారానికి మంత్రులు చొరవ చూపాలని సూచించారు. ఇన్‌ఛార్జులుగా ఉన్న జిల్లాల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం బాధ్యతలను మంత్రులు తీసుకోవాలన్నారు. మంత్రుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడంలో కొందరు వెనుకబడి ఉన్నారన్నారు. విపక్షాల దుష్ప్రచారాలను సమర్ధవంతంగా తిప్పకొట్టాలని సూచించారు.
త్వరలో కొణిదెల నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని, ఆ క్రమంలోనే ముగ్గురు లేదా నలుగురిని మంత్రివర్గం నుంచి తొలగించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నానని, మీ జాతకాలు తన వద్ద ఉన్నాయని సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడంతో పలువురు మంత్రుల్లో కలకలాన్ని రేపుతోంది. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.