అల్లు అర్జున్ విషయంలో అనుకూల ప్రతికూల వాదనలు
అల్లు అర్జున్ కు సానుభూతి తెలపడం పట్ల సీఎం అభ్యంతరం
చనిపోయిన రేవతి కుటుంబాన్ని సినీ ప్రముఖులు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్న
సంఘటనలో చలి మంటలు కాచుకుంటున్నారనే విమర్శలు …
అల్లు అర్జున్ ఇంటిపై దాడి పై విమర్శలు
ఇటీవల విడుదలైన పుష్ప 2 బాక్స్ ఆఫీసును బద్దలు కొట్టింది …ప్రపంచ వ్యాపితంగా కలక్షన్ల సునామి సృష్టించింది …బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది …ఈ వేడుకల్లో పాల్గొనాల్సిన హీరో అల్లు అర్జున్ , చిత్ర యూనిట్ విషాదంలో మునిగిపోయారు .. హైదరాబాద్ సంధ్య థియటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వారికీ మాయని మార్చని మిగిల్చింది … తెలంగాణాలో సినీ రాజకీయంతో వేడెక్కింది …కొన్ని రాజకీయ పార్టీల సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పౌరసమాజం గమనిస్తుంది ..
సినిమా విడుదలైన మొదటి రోజు సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో గల సంధ్య థియటర్ కు వెళ్లారు .. …ఆయన్ను చూసేందుకు ఎగబడిన అభిమానుల తొక్కుసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందింది …ఆమె కుమారుడు తేజ అపస్మారక స్థితిలో కిమ్స్ ఆసుపత్రిలో కొట్టు మిట్టాడు తున్నాడు … మహిళా చనిపోవడం , ఆమె కుమారుడు తొక్కిసలాటలో కిందపడి బ్రెయిన్ డైడ్ కావడం యదార్థం… దీన్ని ఎవరు కాదనలేని నగ్నసత్యం … దీనికి భాద్యులు ఎవరు అనేది తేలాల్చి ఉంది … పోలీసులు ప్రాధమిక విచారణలో హీరో అల్లు అర్జున్ పాటు మరి కొందరిపై కేసు నమోదు చేశారు …హీరో అర్జున్ ను 11 ముద్దాయిగా చేర్చారు …కొన్ని రోజుల తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు …ఆయన అరెస్ట్ పెద్ద నేరమన్నట్లు , అసలు ఆయన్ను అరెస్ట్ చేయడమేమిటనే ప్రశ్నలు ఉదయించాయి..చివరకు అరెస్ట్ చేయడం జైలుకు తరలించడం అదే రోజు బైలు రావడం జరిగింది …అర్ధరాత్రి విడుదల చేయాలనీ కోర్ట్ ఆదేశించిందని అయనప్పటికీ ఆయన్ను విడుదల చేయడంలో ఆలస్యం అయిందని చిత్ర సీమ గగ్గోలు పెట్టింది ,సానుభూతి కురిపించింది …ఆయన విడుదల తర్వాత చిరంజీవి లాంటి మెగాస్టార్లు ,అనేకమంది అల్లు అర్జున్ ఇంటికి వచ్చి ఆయన్ను పరామర్శించారు …అరె ఒక్క రోజు జైల్లో ఎలా ఉన్నవని … ఏమి పెట్టారు …ఏమి తిన్నావు అని అడిగి సానుభూతి ప్రకటించారు …అదే తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదనేది సీఎం శాసనసభ వేదికగా సూటిగానే ప్రశ్నించారు …దానికి ఏ హీరో నుంచి ఇంతవరకు సమాధానం లేదు …పైగా సంఘటనను రాజకీయం చేసేందుకు చూడటం దుర్మార్గం …ఒక వ్యక్తి చనిపోతే దాన్ని వదిలిపెట్టి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంశించాల్సిన కొన్ని రాజకీయ పార్టీలు , అందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఎదో తప్పు చేసినట్లు మాట్లాడటం విడ్డురం …రాహుల్ గాంధీ ఎక్కడో మోడీ కులాన్ని విమర్శించారని కేసు పెట్టి కోర్టుకు రప్పించి , ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసిన పార్టీ నేతలు అల్లు అర్జున్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు జుగుస్సాకరం …పెద్ద పెద్ద నేతలే జైళ్లకు వెళ్లారు …ఇందిరా గాంధీ , వాజ్ పాయి , ఎల్ కె అద్వానీ , జయప్రకాశ్ నారాయణ , వై యస్ జగన్ , చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన వారే … తిరిగి ప్రజా జీవితంలో ఉన్నతస్థానాలు అలంకరించారు …ఒక వేళ అల్లు అర్జున్ ది ఎలాంటి తప్పు లేదని తేల్చాల్సింది ఎవరు … న్యాయస్థానాలు …కానీ ముందుగానే పెద్ద పదవుల్లో ఉన్న కేంద్ర మంత్రులు ఆయనకు అనుకూలంగా మాట్లాడటం సరైంది అనిమించుకోదు …బీజేపీ పార్టీ నేతలు ఈ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చలిమంటలు కాచుకున్న చందంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి … బీజేపీకి ఉన్న క్రెడిబులిటీ పై చర్చకు అవకాశం ఇచ్చేదిలా ఉంది …
అల్లు అర్జున్ సీఎం శాసనసభలో చేసిన ప్రకటనకు రియాక్ట్ కాకుండా ఉండాల్సింది …ఒక వేళ కాదల్చుకుంటే సంఘటన జరగడం దురదృష్టకరమని చింతిస్తున్నానని ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని , హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాబు ఖర్చు అంతా తానే భరిస్తానని చెప్పి మరోసారి తనకు క్షమించమని ప్రకటన విడుదల చేస్తే ఆయన మైలేజ్ మరింత పెరిగేది …కానీ అందుకు విరుద్ధంగా పోలీస్ వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు …తాను వెంటనే అక్కడ నుంచి వచ్చాను …మహిళ మరణించిన సంగతి రెండవరోజు తెలిసిందని చెప్పడాన్ని పౌరసమాజం అంగీకరించడంలేదు … తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయినట్లు అదే రోజు అన్నిటీవీ ఛానల్స్ స్క్రోల్ చేశాయి … నెత్తి నోరు మొత్తుకొని మరి చెప్పాయి…కానీ తనకు రెండవరోజు తెలిసిందని అల్లు అర్జున్ చెప్పడం తప్పును కప్పి పుచ్చుకునేందుకు చేస్తున్న మరో తప్పులా ఉంది …
అల్లు అర్జున్ ఇంటిపై దాడి సరైంది కాదు …
అదే సందర్భంలో అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయడం హేయమైన చర్య …దీన్ని అందరు ఖండిచాల్సిందే …. ఇలాంటి సంఘటనలు శాంతిభద్రతలకు విఘాతం కల్గించేవిలా ఉన్నాయి. భాద్యులైన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాల్సిందే ..ఆయనకు భద్రతా కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉంది …
అల్లు అర్జున్ నివాసంపై దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి
- హైదరాబాదులో స్టార్ హీరో అల్లు అర్జున్ నివాసంపై దాడి
- సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానంటూ రేవంత్ రెడ్డి ప్రకటన
- శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు
హైదరాబాదులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నివాసంపై దాడి జరగడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.
అల్లు అర్జున్ నివాసానికి వచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి
హైదరాబాదులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నివాసం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు అల్లు అర్జున్ నివాసంలోకి రాళ్లు, టమాటాలు విసిరారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు… కొద్దిసేపటి కిందటే అల్లు అర్జున్ నివాసంలోకి వెళ్లారు. విద్యార్థి సంఘాల ముట్టడి జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న వ్యక్తుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.అటు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా తన అల్లుడి నివాసానికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆయన ఆరా తీశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. సీఎం వ్యాఖ్యలకు స్పందనగా అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టడంతో వాతావరణం వేడెక్కింది. ఇవాళ విద్యార్థి సంఘాలు అల్లు అర్జున్ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో, ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడంలేదు.
మా ఇంటి ముందు ఘటన అందరూ చూశారు: అల్లు అరవింద్
తన కుమారుడు అల్లు అర్జున్ నివాసాన్ని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ముట్టడించిన ఘటనపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. మా ఇంటి ముందు జరిగిన ఘటనను అందరూ చూశారు… ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు అని వ్యాఖ్యానించారు. తొందరపడి ఎవరూ అలాంటి చర్యలకు పాల్పడవద్దు… ఇటువంటి పరిస్థితుల్లో అందరూ సంయమనం పాటించాలి… అదే మంచిది అని అన్నారు.
తమ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారని, దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్నారని అల్లు అరవింద్ వెల్లడించారు. ఎవరూ కూడా ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించవద్దు… దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. పరిస్థితుల దృష్ట్యా… ఇప్పుడు తాము రియాక్ట్ అవకూడని సమయం ఇది అని వ్యాఖ్యానించారు.
కాగా, విద్యార్థి జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసంలోకి ప్రవేశించి పూలకుండీలు ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడి సిబ్బందిపైనా దాడి చేసినట్టు పలు చానళ్లలో విజువల్స్ ప్రసారమవుతున్నాయి.
అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థుల దాడి వీడియోను పంచుకున్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
- హైదరాబాదులో అల్లు అర్జున్ నివాసంపై దాడి
- రాళ్లు, టమాటాలు విసిరిన ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు
- ఇంత దారుణమా అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్
- సిగ్గుపడాలంటూ వ్యాఖ్యలు
హైదరాబాదులో నేడు అల్లు అర్జున్ నివాసాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించడం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఒక్కసారిగా దూసుకువచ్చిన ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటి గోడ ఎక్కి రాళ్లు విసిరారు. నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ గేటు ముందు బైఠాయించారు. బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తూ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.
తెలంగాణలో దారుణమైన దృశ్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పన్ను చెల్లింపుదారుడైన అల్లు అర్జున్ ను టార్గెట్ చేసిందని ఆరోపించారు.
ఒక జాతీయ స్థాయి హీరోకు వ్యతిరేకంగా రాళ్లు విసరడం, వేధింపులకు పాల్పడడం చూస్తుంటే, ప్రముఖ వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది అని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, సిగ్గుపడాల్సిన విషయం అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అల్లు అర్జున్ నివాసంపై దాడి వెనకున్నది కాంగ్రెస్ పార్టీయేనా?: కిషన్ రెడ్డి
- హైదరాబాదులో అల్లు అర్జున్ నివాసంపై దాడి
- రాళ్లు విసిరి, పూలకుండీలు ధ్వంసం చేసిన విద్యార్థి జేఏసీ నేతలు
- కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి ఇదే నిదర్శనమన్న కిషన్ రెడ్డి
హైదరాబాదులో అల్లు అర్జున్ నివాసంపై విద్యార్థి సంఘాల నేతలు రాళ్ల దాడికి పాల్పడడం పట్ల కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంతిభద్రతలు దిగ్భ్రాంతికర రీతిలో క్షీణించాయన్న వాస్తవాన్ని ఎత్తిచూపుతోందని పేర్కొన్నారు. పౌరుల భద్రతకు భరోసా ఇవ్వడంలోనూ, వారికి రక్షణ కల్పించడంలోనూ పాలకుల అసమర్థత ప్రతిఫలిస్తోందని విమర్శించారు.
నటులను, చిత్రపరిశ్రమను టార్గెట్ చేయడం అనేది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కనిపిస్తున్న ప్రమాదకర ధోరణి అని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి వెనకున్నది కాంగ్రెస్ పార్టీయేనా? ఇది కాంగ్రెస్ ప్రోత్సాహంతో జరిగిన దాడేనా? అని సందేహం వెలిబుచ్చారు. ఈ మేరకు దాడి వీడియోను కూడా కిషన్ రెడ్డి పంచుకున్నారు.