- షేక్ హసీనాతో పాటు 12 మంది పేర్లను చేర్చిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్
- కోర్టు ఎదుట హాజరు కావడానికి ఫిబ్రవరి 12 వరకు గడువు
- గత అక్టోబర్‌లో మొదటిసారి నోటీసులు జారీ చేసిన కోర్టు
బంగ్లాదేశ్‌లో పలువురి అదృశ్యం, హత్యలకు సంబంధించి ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌కు కోర్టు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ఐసీటీ) ఈరోజు మరో వారెంట్ జారీ చేసింది. ఇందులో షేక్ హసీనాతో పాటు మరో పన్నెండు మంది పేర్లను చేర్చింది. కోర్టు ఎదుట హాజరు కావడానికి వారికి ఫిబ్రవరి 12వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
షేక్ హసీనా రక్షణ సలహాదారు, మేజర్ జనరల్ (రిటైర్డ్) తారిక్ అహ్మద్ సిద్దిఖీ, మాజీ ఐజీ బెనజీర్ అహ్మద్, మాజీ నేషనల్ టెలి కమ్యూనికేషన్స్ మానిటరింగ్ సెంటర్ డీజీ జియావుల్ అహ్‌సాన్ తదితరులు ఉన్నారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన తర్వాత ఆమెకు వారెంట్ జారీ కావడం ఇది రెండోసారి. గత ఏడాది అక్టోబర్‌లో మొదటిసారి నోటీసు జారీ అయింది.
ఈసారి షేక్ హసీనాకు వారెంట్ జారీ చేసిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్… ఇంటర్‌పోల్ సాయం కూడా కోరింది. మొదటిసారి నోటీసులు జారీ చేసినప్పుడు నవంబర్ 18న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఐటీసీ మరోసారి నోటీసులు జారీ చేసింది.