విశాఖ సభలో మోడీని పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ , లోకేష్
ప్రశంశల జల్లులో తడిసి ముద్దైన మోడీ
రాసిపెట్టుకోండి ఢిల్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు ఖాయం …విశాఖ సభలో చంద్రబాబు
హర్యానా మహారాష్ట్రలో గెలిచిన ఎన్డీయే…కారణం మోడీ అన్న చంద్రబాబు
మోడీపై ప్రశంసల జల్లు …ఆయన ప్రపంచనాయకుడని ఉద్ఘాటన
ప్రపంచ ఆర్థికవ్యవస్థలో మనం ఐదవ స్థానంలో ఉన్నాం …మూడవస్థానం చేరుకోబోతున్నామన్న బాబు ..
గతంలో ఏ ప్రధాని చేయని విధంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న మోడీ అన్న బాబు
తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రధానిని చూడలేదన్న బాబు
గతేడాది జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. రాసి పెట్టుకోండి.. వచ్చే నెలలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీదే విజయమని ఏపీ సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. అంతకు ముందు మాట్లాడిన లోకేష్ ,పవన్ కళ్యాణ్ లు కూడా మోడీని ఆకాశానికి ఎత్తారు …వారి పొగడ్తలు విన్న మోడీ ముసి ,ముసి నవ్వులు నవ్వుకున్నారు …
చంద్రబాబు మాట్లాడుతూ దేశ ప్రజలంతా మోడీ వెంటే ఉన్నారు.. ఇకపైన మోడీతోనే ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం, పేద ప్రజల కోసం ప్రధాని మోడీ ప్రతిక్షణం పని చేస్తున్నారని కొనియాడారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రజలకు దగ్గరైన వ్యక్తి మోడీ అని.. ప్రపంచ మెచ్చే నాయకుడు మోడీ అని ప్రధానిని ఆకాశానికెత్తారు. వివిధ అభివృద్ధి పనుల శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం ప్రధాని మోడీ బుధవారం ఏపీ విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ ఏయూలో భారీ బహిరంగా సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీ, జనసేన కాంబినేషన్ అదిరిందని.. చరిత్రలో నిలిచిపోయేలా 93 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లతో ఎన్డీఏను ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఏపీలో ఈ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుందని.. మోడీనే ప్రధానిగా ఉంటారని అన్నారు. ప్రధాని మోడీ నుండి తాను స్ఫూర్తి పొందుతుంటానని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడంలో ప్రధాని మోడీ సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. మీరు శంఖుస్థాపన చేసి.. కలలు కన్న అమరావతిని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రధాని మోడీ సారథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు నదుల అనుసంధానం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రామాయపట్నంలో బీపీసీఎల్ వచ్చిందంటే దానికి కారణం ప్రధాని మోడీనే అని చెప్పారు. రేపటి గురించి ఇవాళే ఆలోచించే ప్రధాని ఉండటం మన అదృష్టమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వల్ల ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని.. కష్టాలు, సమస్యలు ఉన్నాయి.. వాటిని అధగమించి ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయని.. విశాఖలో గూగూల్ పెట్టుబడులకు ముందుకు రావడమే ఇందుకు నిదర్శమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటున్నామని అన్నారు. 2025, జనవరి 8వ తేదీ ఏపీ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే రోజు- అని.. 7 నెలల్లోనే రూ.2లక్షల కోట్ల పనులకు మోడీ శ్రీకారం చుట్టారని తెలిపారు. రూ.లక్షా 85వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్.. విశాఖ రైల్వేజోన్‌కు పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. 7 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయన్నారు.
మోదీ గారూ… మనిద్దరి స్కూల్ ఒకటే: చంద్రబాబు
- విశాఖ సభలో మోదీని కొనియాడిన చంద్రబాబు
- మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు అని కితాబు
- ఇవాళ్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ అని వెల్లడి
విశాఖ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు అని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు అని వెల్లడించారు. ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ అని చంద్రబాబు పేర్కొన్నారు. తామిద్దరి ఆలోచనా తీరు ఒకటేనని వ్యాఖ్యానించారు.
“మోదీజీ…మీరు అభివృద్ధికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేము మిమ్మల్ని ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకుంటాం. అమరావతి రాజధానికి మీరే శంకుస్థాపన చేశారు. మీ ఆశీస్సులతోనే రాజధానిని పూర్తి చేసుకుంటాం. దాన్ని మీరే ప్రారంభిస్తారు. మీరు ఒకసారి అమరావతి రావాలని కోరుతున్నాం. నదుల అనుసంధానికి కూడా మీరు ప్రాధాన్యం ఇస్తారు. పోలవరం ప్రాజెక్టును మీ నాయకత్వంలో పూర్తి చేస్తాం. మీ ఆశీస్సులతో నదుల అనుసంధానం ప్రారంభిస్తున్నాం… మీ ఆశీస్సులతోనే పూర్తి చేస్తాం.
అత్యంత వెనకబడిన ప్రాంతమైన రామాయపట్నంలో బీపీసీఎల్ ప్రాజెక్టు వచ్చింది. రాష్ట్ర ప్రజల మీకు ధన్యవాదాలు చెబుతున్నారు. గూగుల్ కూడా ఏఐలో పెట్టుబడులు పెట్టేందుకు విశాఖపట్నం వస్తోంది.
గూగుల్ ప్రతినిధులు నాతో సమావేశమైనప్పుడు భవిష్యత్తులో పన్నులు పెంచే అవకాశం ఉందా? అని ప్రస్తావించారు. ఇటీవల ప్రధానితో సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావించాను. ప్రభుత్వం తెచ్చిన పాలసీల్లో మార్పులు ఉండవు… మీరు ధైర్యంగా ముందుకెళ్లండని చెప్పారు. ఇంతకంటే విశాఖ ప్రజలకు ఏం కావాలి?
మోదీజీ… మీ స్కూల్, నా స్కూల్ ఒక్కటే. రేపు చేయాల్సిన పని, నిన్ననే చేసి ఉంటే బాగుండేదని ఆలోచించే ప్రధాని ఉండటం మన రాష్ట్ర ప్రజల అదృష్టం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ఎన్డీయే విధానం. కొప్పర్తి, ఓర్వకల్లుకు ఇండస్ట్రియల్ పార్కులు వచ్చాయి. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.
వికసిత్ భారత్ నరేంద్ర మోదీ కల. స్వర్ణాంధ్ర ప్రదేశ్ మన కల. ప్రధాని దేశాన్ని ప్రపంచంలో నిలబెడితే…2047 నాటికి ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉండాలి. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు సరైన సమయంలో మోదీ దేశానికి ప్రధాని అయ్యారు” అని సీఎం అన్నారు.
ఇక విజయాలే తప్ప అపజయాలు ఉండవు
మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు నిరంతరం కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాన్ని చేరుకోలేం. నిరంతర పాలన ఇస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చేసి నిరూపించిన వ్యక్తి మోదీ. ఎన్డీయే బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. ఇక్కడ కూటమి ధృడంగా ఉంటే ఏపీ బలంగా ఉంటుంది.
డబుల్ ఇంజన్ సర్కార్… డబుల్ డిజిట్ గ్రోత్. రెండు ప్రభుత్వాలు ఒక్కటిగా ఉంటే రెండంకెల వృద్ధి సాధ్యమై పేదరికం పోతుంది. కూటమి తరపున హామీ ఇస్తున్నా… పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం. ఇది మొదటి అడుగు… ఇక జయాలే తప్ప అపజయం ఉండదు” అని సీఎం చంద్రబాబు అన్నారు.