Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖ రోడ్లపై పూలవర్షం కురుస్తుండగా… సభా వేదిక చేరుకున్న మోదీ, చంద్రబాబు, పవన్!


విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ త్రయం ఎక్కిన ప్రత్యేక వాహనం నిదానంగా ముందుకు సాగుతుండగా… ప్రజలు పూలవర్షం కురిపించారు. 

సిరిపురం సెంటర్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజి వరకు రోడ్డుకు ఇరువైపులా జనం పోటెత్తారు. ఎన్నికల వేళ ఇదే త్రయం విజయవాడలో నిర్వహించిన భారీ రోడ్ షోను తలదన్నేలా నేడు విశాఖలో రోడ్ షో జరిగింది. 

ఎన్డీయే కూటమి గెలిచాక ప్రధాని మోదీ తొలిసారి ఏపీ వచ్చిన నేపథ్యంలో… ప్రధాని పర్యటనను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అడుగడుగునా విజయోత్సాహం ప్రతిబింబించేలా భారీ ఏర్పాట్లతో రోడ్ షో ఏర్పాటు చేసింది. 

కాగా, మోదీ, చంద్రబాబు, పవన్ వాహనం నేరుగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలోకి ప్రవేశించింది. సభకు విచ్చేసిన ప్రజలకు అభివాదం చేస్తూ ముగ్గురు నేతలు ముందుకు సాగారు. ఇక, ఈ సభ ద్వారా మోదీ ఏపీకి సంబంధించిన అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

ఇక, వేదికపైకి చేరుకున్న అనంతరం… ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు సత్కరించారు. మోదీకి శేషశయనుడి విగ్రహం, అరకు కాఫీని బహూకరించారు. వేదికపై మోదీ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేశ్  తదితరులు ఆసీనులయ్యారు. 

Related posts

సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన జస్టిస్ నరసింహారెడ్డి

Ram Narayana

ఇద్దరికంటే ఎక్కువమంది పిల్ల‌లున్నా ఏపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి అర్హత‌!

Ram Narayana

నేడు టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం..

Drukpadam

Leave a Comment