- ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై ఆరోపణలు
- నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరైన కేటీఆర్
- దాదాపు ఆరున్నర గంటల పాటు విచారణ
- అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్
- కొత్త ప్రశ్నలేమీ అడగలేదని వెల్లడి
- ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని స్పష్టీకరణ
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ కొద్దిసేపటి కిందట ముగిసింది. ఏసీబీ అధికారులు దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించారు. కేటీఆర్ పై విచారణను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షించారు. విచారణ సందర్భంగా, కేటీఆర్ ను ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్ ప్రశ్నించారు.
విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని వెల్లడించారు. ఏసీబీ అధికారులకు విచారణలో సహకరించానని తెలిపారు.
ఇది ఒక చెత్త కేసు అని, రాజకీయ కక్షపూరిత కేసు అని విచారణ అధికారులకు చెప్పానని వెల్లడించారు. ఇటువంటి అసంబద్ధమైన కేసులో ఎందుకు విచారణ జరుపుతున్నారని అడిగానని కేటీఆర్ వివరించారు.
ఏసీబీ అధికారులు కొత్త ప్రశ్నలేమీ అడగలేదని, వారడిగిన ప్రశ్నలకు నాకున్న అవగాహన మేరకు జవాబులు ఇచ్చాను అని తెలిపారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానని చెప్పానని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై కేటీఆర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీబీతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది.
కనపుపు సింహాసనంపై శునకాన్ని కూర్చుండబెట్టినా దాని బుద్ధి మారందంటూ సీఎం రేవంత్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు.
తెలంగాణ భవన్‌లో ఆయన బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కేసు లేదు పీసు లేదు. ఇది ఒక లొట్టపీసు కేసు మాత్రమే. ఇందులో ఇంకా ఏం లేదు. ఈడికేలి పైసా పోయింది.. అక్కడ పైస ఉన్నది. అవినీతి ఎక్కడ జరిగిందని అడిగితే నీళ్లు నములుతున్నరు. అందుకే నేను రేవంత్‌రెడ్డిని అడుగుతున్న. నీకు పైశాచిక ఆనందం ఉంది. నేను జైలుకు వెళ్లినకాబట్టి అందరినీ జైలుకు పంపాలనే నీకు ఆనందం. నేను విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినకాబట్టి నాకు విదేశాల స్థాయిలో రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని నాకుంది. నీకు, మాకు తేడా అదే’నన్నారు.
నిన్ను ఎవరూ ముఖ్యమంత్రి కింద చూస్తలేరు..
‘ప్రపంచపటంలో హైదరాబాద్, తెలంగాణను పెట్టాలని మా నాయకుడు కేసీఆర్, మా కమిట్‌మెంట్. మేం నీలాగా రూ.50లక్షలతో దొరికిన దొంగలం కాదు. నీలా లుచ్చా పనులు చేసినోళ్లం కాదు. నీకు భయపడేవారు బీఆర్‌ఎస్ పార్టీలో, తెలంగాణలో ఎవరూ లేరు. ఇదినేను చెప్పడం కాదు.. మీరంతా చూస్తున్నరు. రాష్ట్రంలో ఎవరూ రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేరు. ఎవరైనా ఏమన్నా అంటే కేసులు పెట్టి లోపటేస్తరు. ఆయనెవరో పేరు మరిచిపోయారని నేను అనను. ఎందుకంటే నిన్ను ఎవరూ గుర్తుపడుతలేరు. సంవత్సరం అయినా కూడా నిన్ను ఎవరూ దేకపోతే నేనేం చేయాలి? అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పారు. కనపు సింహాసనమున శునకమును కూర్చుండబెడితే.. దానికి ఆ బుద్ధి రాదు. అందుకే భయపడేది లేదు. బాధపడేది లేదు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తా’నన్నారు.
ఇది లొట్టపీస్ కేసే..
మీరంతా తదేక దీక్షతోని మన నాయకుడు కేసీఆర్ చెప్పినట్లుగా ఉద్యమంలో ఎంత కమిట్‌మెంట్‌తో పని చేసినమో.. అదే కమిట్‌మెంట్‌తో ముందుకు వెళ్దాం. వాళ్లు ఎన్ని ప్రశ్నలు వేసినా.. ఎన్ని సవాళ్లు విసిరినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. కొత్త కొత్త కేసులు పెట్టినా భయపడేది లేదు. తలవంచేది లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. ఎవరుఏమనుకున్నా సరే.. ఇది లొట్టపీసు కేసే. ఆయన లొట్టపీసు ముఖ్యమంత్రే. బరాబర్ కొట్లాడుదాం.. గట్టిగా ముందుకు వెళ్దాం. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటదో.. మైసూర్ బోండాలో ఎంత మైసూర్ ఉంటదో.. ఈ కేసులో ఉంది. కేసు లేదు తొక్క లేదు’ అన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రశ్నలు పంపిస్తడేమో..
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారా? అని పలువురు ప్రశ్నించగా.. వాళ్ల వద్ద అడిగేందుకు ప్రశ్నలు లేవని.. రేవంత్‌రెడ్డి మళ్లీ పంపిస్తే పిలిస్తారు కావొచ్చు అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఇందులో ఏం ఉందని అడుగుతున్నరని తాను ఏసీబీ అధికారులను అడిగానన్నారు. ఫైల్ అందులో నుంచి ఇండ్లకు.. ఇండ్ల నుంచి అండ్లకు వెళ్లింది నీకు తెలుసా? అని అడుగుతున్నారని, ఒక మంత్రిగా తెలంగాణ బాగును కోరే వ్యక్తిగా.. నేను నిబ్దతతో మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు ఈ-రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పానన్నారు. ఒక పైసా అవినీతి, చిన్న తప్పుకానీ చేయలేదని.. చేసినట్లు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారని అన్నట్లు తెలిపారు. అక్రమ కేసు బనాయించి నాలుగు రోజులు జైలులో పెట్టాలనే పైశాచిక, శునకానందం నీకు ఉంటే.. ఉండొచ్చు. కానీ, భయపడేది ఎవరూ లేరని, తమకు న్యాయస్థానాలపై విశ్వాసం ఉందని, న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని.. మళ్లీ పిలిస్తే విచారణకు వెళ్తానని స్పష్టం చేశారు. రేపటి నుంచి బీఆర్‌ఎస్ నేతలు ఎక్కడివారంతా అక్కడ ప్రజాసమస్యలపై ప్రస్తావిస్తూ ముందుకు వెళ్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.