- అధికారుల వైఫల్యాలను సీఎం చంద్రబాబు గమనించారన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి
- ఇన్‌ఛార్జిగా పెట్టిన డీఎస్పీ అక్కడి లేకుండా ఎక్కడికో వెళ్లారని వెల్లడి
- ఒకవైపుగా తెరవాల్సిన గేట్లను మరోవైపు తెరిచారన్న మంత్రి
తిరుపతిలో పద్మావతి పార్కు వద్ద ఉన్న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమైనదని, ఎంతో బాధాకరమైనదని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఒక మహిళకు షుగర్ లెవల్స్ తగ్గిపోయి పడిపోవడంతో ఆమెను హాస్పిటల్‌కు తరలించేందుకు గేట్ తెరిచారని, అయితే, టోకెన్లు ఇస్తున్నారని భావించిన భక్తులు ఒక్కసారిగా గెట్లమీద పడ్డారని, అందుకే తొక్కిసలాట జరిగిందని మంత్రి వివరించారు.
ఒకవైపుగా తెరవాల్సిన గేట్లను మరోవైపు తెరిచారని చెప్పారు. ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించారని, అధికారుల వైఫల్యాలను కూడా ఆయన గమనించారని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఇన్‌ఛార్జిగా పెట్టిన డీఎస్సీ ర్యాంక్ పోలీసు అధికారి ఘటన జరిగిన సమయంలో అక్కడ లేకుండా ఎక్కడికో వెళ్లారని వివరించారు. చనిపోయిన ఆరుగురికి వెంటనే పోస్టుమార్టం చేసి అంబులెన్స్‌ల్లో మృతదేహాలను, ప్రత్యేక వాహనాల్లో కుటుంబ సభ్యులను వారి ఇళ్లకు పంపించామని, ఒక రెవెన్యూ అధికారిని కూడా వారి వెంట తోడుగా పంపించామని ఆయన వెల్లడించారు.
మృతుల్లో నలుగురు ఏపీకి చెందినవారు కాగా, ఒకరు తమిళనాడు, మరొకరు కేరళకు చెందినవారని మంత్రి తెలిపారు . గాయపడ్డ 35 మందికి రుయా హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం స్విమ్స్ హాస్పిటల్‌కు తరలించారని రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ముగ్గురు మంత్రులతో ఏర్పాటు చేసిన సబ్-కమిటీ ప్రతి బాధితుడిని కలిసి వివరాలను సేకరించిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఒకటిన్నర గంట పాటు 35 మంది పేషెంట్లను వ్యక్తిగతంగా పరామర్శించారని, అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల సాయం ఇవ్వాలంటూ సీఎం ఆదేశించారని మంత్రి వివరించారు.
మరోవైపు, తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి ఇవాళ (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశం కానుంది. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై సమావేశంలో తీర్మానం చేయనున్నారు. శనివారం మృతుల స్వస్థలాలకు వెళ్లి చెక్కులు అందజేయడంపై చర్చించనున్నారు.