- మన దేశంలో క్రమంగా పెరుగుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు
- హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదన్న చైనా పరిశోధకుడు వాంగ్ లిపింగ్
- హెచ్ఎంపీవీ కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న చైనా
మన దేశంలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఎక్కడో చోట కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ వారంలో గుజరాత్, అస్సాం, పుదుచ్చేరిలలో కొత్త హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పుడు మొత్తం 17 హెచ్ఎంపీవీ కేసులు ఉన్నాయి. దీంతో హెచ్ఎంపీవీ రూపంలో మరో మహమ్మారి ముంచుకురాబోతుందని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ తరుణంలో చైనా నుంచి ఒక శుభవార్త అందింది. తమ దేశంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరిశోధకుడు వాంగ్ లిపింగ్ మాట్లాడుతూ.. హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని అన్నారు. కనీసం రెండు దశాబ్దాలుగా ఇది మనతోనే ఉందని చెప్పారు.
2001లోనే నెదర్లాండ్స్‌లో తొలిసారి గుర్తించబడిందని, అయితే ఈ వైరస్ కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిందన్నారు. ఇప్పుడు కేసుల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతోందన్నారు. చైనా ఉత్తర భాగంలో పాజిటివ్ కేసుల రేటు తగ్గుతోందని ఆయన తెలిపారు.