- కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే ఫిర్యాదు
- నిన్న సాయంత్రం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఈరోజు ఉదయం జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చింది. రెండు రోజుల క్రితం కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్ రెడ్డి తనను దుర్భాషలాడారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కరీంనగర్ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో నిన్న హైదరాబాద్‌లో ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం కరీంనగర్‌లో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ముందు పోలీసులు హాజరుపరిచారు. జడ్జి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.
అంతకుముందు, కరీంనగర్ పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి నివాసానికి తరలించే క్రమంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే హామీలను అమలుపరిచే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.
బెయిల్ పై బయటికి వచ్చాక కేటీఆర్, హరీశ్ లను కలిసిన కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. బెయిల్ పై బయటికి వచ్చిన అనంతరం కౌశిక్ రెడ్డి… బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హరీశ్ రావులను కలిశారు.
కౌశిక్ రెడ్డిని ఆత్మీయంగా హత్తుకున్న కేటీఆర్… భుజం తట్టి అభినందించారు. కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీలో ప్రతి ఒక్కరం కౌశిక్ రెడ్డికి అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
అనంతరం, కౌశిక్ రెడ్డి… హరీశ్ రావును కలిశారు. హరీశ్ కూడా… కౌశిక్ రెడ్డిని హత్తుకుని అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను పాడి కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
- బెయిల్ మంజూరైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే
ఈరోజు సంక్రాంతి జరుపుకుంటున్నామని, ఈ పండుగ రోజున ఎలాంటి రాజకీయాలు మాట్లాడవద్దనుకుంటున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈరోజు ఉదయం ఆయనకు బెయిల్ మంజూరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ… రేపు హైదరాబాద్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని విషయాలను వెల్లడిస్తానన్నారు.
నిన్నటి నుంచి తన విషయంలో హైడ్రామా జరుగుతోందని, ఈ సమయంలో తనకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అండగా నిలిచారన్నారు. వారందరికీ చేతులు జోడించి, శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. నా కష్టకాలంలో మీరంతా అండగా నిలిచారన్నారు.
కోర్టును కూడా మనం గౌరవించాల్సి ఉందన్నారు. కరీంనగర్ పట్టణ ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టవద్దని కోర్టు షరతు విధించిందన్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా నిద్ర లేకుండా రాత్రంతా ఈ హడావుడిని కవర్ చేశారని, ఇందుకు ధన్యవాదాలు అన్నారు. తెలంగాణ ప్రజలకు, కరీంనగర్ ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.