- మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఎస్ఎస్ఎంబీ 29’
- యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా సినిమా
- ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్త పడుతున్న మేకర్స్
- నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్
- హీరో మహేశ్ సహా సెట్‌లోకి ఎవరూ మొబైల్స్ తీసుకురాకూడదు
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఎస్ఎస్ఎంబీ 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఓ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
తాజాగా జక్కన్న.. మహేశ్ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ మూవీ షూటింగ్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా మేకర్స్ ఎంతో జాగ్రత్త పడుతున్నారు.
దీనిలో భాగంగా ఈ భారీ ప్రాజెక్టులో నటిస్తున్న మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇతర నటీనటుల వివరాలు బయటకు రాకుండా మేకర్స్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో చిత్రం యూనిట్‌కి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణులతో ‘నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్’ (ఎన్‌డీఏ) చేయించినట్లు ఆంగ్ల పత్రిక కథనాలు వెలువరించాయి.
ఈ అగ్రిమెంట్ ప్రకారం దర్శక-నిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేసినా, బయటకు చెప్పినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రిన్స్ మహేశ్ సహా షూటింగ్ స్పాట్‌లో ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదట. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కానున్నారు.
ఇక ఈ చిత్రం కోసం ప్రిన్స్ పూర్తిగా మేకోవర్ అయిన విషయం తెలిసిందే. లాంగ్ హెయిర్‌స్టయిల్, గుబురు గడ్డంతో మహేశ్ ఇటీవల పలు వేడుకల్లో కనిపించారు. అలాగే బాడీ కూడా బాగా బిల్డ్ చేశారు. మహేశ్ కొత్త లుక్ పట్ల ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.