జర్నలిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడితే సహించేది లేదు
కట్టడి చేయాలంటూ ప్రజాప్రతినిధులకు, పార్టీల నేతలకు విజ్ఞప్తి
వినతి పత్రాలు అందించిన కూకట్పల్లి ప్రెస్ క్లబ్
జర్నలిస్టుల పేరుతో భవన నిర్మాణదారుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న పార్టీ నాయకులను కట్టడి చేయాలని శాసనసభ్యులకు రాజకీయ పార్టీల నేతలకు కూకట్పల్లి ప్రెస్ క్లబ్ విజ్ఞప్తి చేసింది. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వ పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికేపూడి గాంధీ, కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు మాధవరం కాంతారావు, కూకట్పల్లి జనసేన పార్టీ ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులకు డబ్బులు ఇవ్వాలని భవన నిర్మాణ దారులను బెదిరిస్తూ
కొందరు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ల వల్ల సమాజంలో జర్నలిస్టుల పట్ల చులకన భావం ఏర్పడుతుందని అన్నారు. మున్సిపల్ అధికారులు, కాలనీల సంక్షేమ సంఘం నేతలు సైతం జర్నలిస్టుల పేరు చెప్పి ఇళ్ల నిర్మాణదారులను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇటు రాజకీయ నాయకులను, అటు అధికారులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఎవరైనా వసూళ్లకు పాల్పడొద్దు : గాంధీ
సామాన్యులను ఇబ్బంది పెట్టే విధంగా జర్నలిస్టుల పేరుతో వసూళ్లకు ఎవరు పాల్పడిన సహించేది లేదని
శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ అన్నారు. జర్నలిస్టు సంఘం మూకుమ్మడిగా అందరుకలిసి విజ్ఞప్తి చేయడం హర్షనీయమన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై,తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మంచి పరిణామం: మాధవరం కృష్ణారావు
కూకట్పల్లి ప్రెస్ క్లబ్ చేపట్టిన ఈ కార్యక్రమం శుభ పరిణామమని కూకట్పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు. సమాజంలో జర్నలిజం విలువలు దిగజార్చ కుండా ఉండేందుకు కూకట్పల్లి ప్రెస్ క్లబ్ శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. మున్సిపల్ అధికారులతో జర్నలిస్టులతో కలిపి ఉమ్మడి సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. జర్నలిస్టులను బద్నాం చేస్తూ డబ్బులు వసూలు చేసే వారు ఎవరైనా సరే వదిలి పెట్టొద్దని చెప్పారు.
అన్ని విధాలుగా సహకరిస్తా: బండి రమేష్
కూకట్పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ అన్ని విధాలుగా సహకరిస్తానని కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్ తెలిపారు. సామాన్యులను జర్నలిస్టుల పేరుతో ఎవరు ఇబ్బందులు పెట్టినా కూడా సరి అయింది కాదన్నారు. ఇప్పటినుంచైనా ఈ అంశంపై అందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, యూనియన్ రాష్ట్ర నాయకులు తొట్ల పరమేష్, ఆర్కే దయాసాగర్, మామిడాల రవీందర్ రెడ్డి, నిమ్మల శ్రీనివాస్, కూకట్పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం ఏ కరీం, కార్యదర్శి రంజిత్ కుమార్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాణిక్య రెడ్డి, గంగరాజు, నవీన్ రెడ్డి, లక్ష్మణ్, సదా మహేష్, హరిబాబు, నజీర్, నాగరాజు, బంటు ప్రవీణ్, శ్రీనివాస్ యాదవ్, చంద్ర, పవన్, తిరుపతి, భాస్కర్, నర్సింగరావు, వెంకట్రావు, సోమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.