- అమెరికా రాజకీయ విశ్లేషకుడు కార్ల్ సన్ తాజా వ్యాఖ్యలు
- దీనికి బలమైన ఆధారాలు లేవని ఒప్పుకున్న కార్ల్ సన్
- మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభించడమే లక్ష్యంగా పలు కుట్రలు చేశారని ఆరోపణ
అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ హత్యకు కుట్ర జరిగిందని రాజకీయ విశ్లేషకుడు, ఫాక్స్ న్యూస్ మాజీ యాంకర్ టకర్ కార్ల్ సన్ సంచలన ఆరోపణలు చేశారు. బైడెన్ ప్రభుత్వ యంత్రాంగం పుతిన్ ను మట్టుబెట్టడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. ఈమేరకు ప్రముఖ జర్నలిస్ట్ మాట్ తైబీతో నిర్వహించిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యేలా చేయడమే లక్ష్యంగా బైడెన్ యంత్రాంగం పలు కుట్రలు చేసిందని చెప్పారు. ప్రపంచాన్ని యుద్ధంవైపు నడిపించే వ్యక్తులకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ చక్కని ఉదాహరణ అని అన్నారు. అయితే, తన ఆరోపణలకు విశ్వసనీయమైన, నమ్మదగ్గ ఆధారాలు లేవని కార్ల్ సన్ కూడా అంగీకరించారు.
అయినప్పటికీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పై కార్ల్ సన్ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. కాగా, ఫాక్స్ న్యూస్ యాంకర్ గా పేరొందిన కార్ల్ సన్ 2023లో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ‘ది టకర్ కార్ల్ సన్ షో’ పేరుతో పాడ్ కాస్ట్ చేస్తూ అమెరికాతో పాటు ప్రపంచ రాజకీయాలపై తన విశ్లేషణలను శ్రోతలకు వెల్లడిస్తున్నారు. కాగా, కార్ల్ సన్ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటి వరకు స్పందించలేదు. రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రెసిడెంట్ పుతిన్ కు రష్యన్ స్పెషల్ సర్వీస్ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన మార్పులు చేస్తోందని వివరించారు.